సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుంచి చెన్నై చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున కట్టుదిట్టమైన భద్రత నడుమ విరాట్ చెన్నై ఎయిర్‌పోర్టులో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20లకు రిటైర్మెంట్
ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలవగా.. ఫైనల్ అనంతరం కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆపై స్వదేశానికి చేరుకున్న గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్ళు భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి విలువైన సమయాన్ని గడిపాడు. అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్ ఉండటం.. జట్టులో సీనియర్లు తప్పనిసరని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టడంతో చేసేదేం లేక జాతీయ విధులకు హాజరయ్యాడు. అయితే, ఆ సిరీస్‌లో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ ముగియగానే భారత బ్యాటర్ మరోసారి లండన్ ఫ్లైట్ ఎక్కాడు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత విరాట్ మరోసారి బ్యాట్ పట్టనున్నాడు.
VIRAT KOHLI HAS REACHED CHENNAI. 👑
— Johns. (@CricCrazyJohns) September 13, 2024
- It's time for the 🐐 to rule Test cricket. pic.twitter.com/hFVsjEx93y
27వేల పరుగులకు చేరువలో
కోహ్లీ చివరిసారి నవంబర్ 15, 2023న వన్డే ప్రపంచకప్ సందర్భంగా సెంచరీ చేశాడు. అది వన్డే క్రికెట్‌లో అతనికి 50వ సెంచరీ. తద్వారా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక తన చివరి టెస్ట్ సెంచరీ గురించి మాట్లాడితే.. జులై 20, 2023న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేశాడు. ఈసారి ఆ కరువు తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
విరాట్ టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో కలిపి 591 ఇన్నింగ్స్‌లలో మొత్తం 26,942 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతను మరో 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఈ మార్కును చేరుకోవడానికి 623 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. కోహ్లీ 600 ఇన్నింగ్స్‌లలోపే ఆ ఘనత సాధించనున్నాడు.
టెస్టు సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్టు: సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకు (చెన్నై)
- రెండో టెస్టు: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు (కాన్పూర్)