RR vs RCB: జెంటిల్‌మన్ అంటే నువ్వేనయ్యా: విరాట్ కోహ్లీ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ద్రవిడ్

RR vs RCB: జెంటిల్‌మన్ అంటే నువ్వేనయ్యా:  విరాట్ కోహ్లీ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ద్రవిడ్

టీమిండియా మాజీ హెడ్ కోచ్, దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 13) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ద్రవిడ్ తన గొప్ప మనసుతో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఈ సమయంలో క్రచెస్ ధరించిన ద్రవిడ్ వీల్ చైర్ సహాయంతో గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ సమయంలో ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ద్రవిడ్ వీల్ చైర్ లో నుంచి లేచేందుకు ప్రయత్నించాడు.  

ఇది గమనిస్తున్న కోహ్లీ.. ద్రవిడ్ వద్దకు వెళ్లి మీరు ఆటగాళ్ల వద్దకు వెళ్లవద్దని, వారు స్వయంగా మీ వద్దకే వస్తారని అభ్యర్థించాడు. అయితే, ద్రవిడ్ మాత్రం విరాట్ వినయపూర్వకమైన అభ్యర్థనను తిరస్కరించి చైర్ లో నుంచి లేచి ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నడిచాడు. ద్రవిడ్ వ్యక్తిత్వంలో తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ద్రవిడ్ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. మరోవైపు ద్రవిడ్ ను కోహ్లీ గౌరవించిన తీరు నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. 2024 టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటార్ గా ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 

ఆదివారం (ఏప్రిల్ 13) జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్ పై అలవోక గెలుపుతో టోర్నీలో నాలుగో విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో పాటు.. ఛేజింగ్ లో సాల్ట్(33 బంతుల్లో 65:5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 65: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచి కొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17.3 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి గెలిచింది.