RR vs RCB: గుండె పట్టుకున్న కోహ్లీ.. హార్ట్ బీట్ చెక్ చేసిన సంజూ శాంసన్.. ఆందోళనలో విరాట్ ఫ్యాన్స్..!

RR vs RCB: గుండె పట్టుకున్న కోహ్లీ.. హార్ట్ బీట్ చెక్ చేసిన సంజూ శాంసన్.. ఆందోళనలో విరాట్ ఫ్యాన్స్..!

జైపూర్: ఆర్సీబీ, ఆర్ఆర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ అభిమానులను కలవరపాటుకు గురిచేసిన ఘటన ఒకటి జరిగింది. కోహ్లీ 40 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యపరంగా ఎందుకో కొంత అసౌకర్యానికి లోనైనట్లు కనిపించాడు. ఛాతిలో నొప్పి వచ్చినట్లుగా అనిపించడంతో చేత్తో గుండె పట్టుకుని కనిపించాడు. ఈ దృశ్యం కోహ్లీ అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

అంతేకాదు.. సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి తన గుండె ఎలా కొట్టుకుంటుందో, హృదయ స్పందన ఎలా ఉందో చెక్ చేయమని కోహ్లీ అడిగాడు. దీంతో.. చేతికి ఉన్న గ్లౌజ్ తీసేసి కోహ్లీ గుండె మీద చేయి వేసి విరాట్ హార్ట్ బీట్ను సంజూ శాంసన్ చెక్ చేశాడు. హార్ట్ బీట్ నార్మల్గానే ఉందని సంజూ చెప్పడంతో విరాట్ కోహ్లీ కుదుటపడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.

అయితే.. 54 పరుగులు చేసిన తర్వాత ఇలా ఇబ్బంది పడినట్లుగా కోహ్లీ కనిపించినా ఆ తర్వాత 62 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. సాల్ట్ 65 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించగా.. దేవ్దత్ పడిక్కల్ 40 పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.3 ఓవర్లలోనే 175 పరుగులు చేసి గెలుపు జెండా ఎగురవేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్  చేయగలిగింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (47 బంతుల్లో 75:10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.