టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 11 ఏళ్ళ తర్వాత మరో ఐసీసీ టైటిల్ అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడు. శనివారం (జూన్ 29) దక్షిణాఫ్రికా భారత్ 7 పరుగుల తేడాతో గెలవడంతో కోహ్లీ ఖాతాలో కొత్తగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ వచ్చి చేరింది. దీంతో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అండర్ 19 వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఈ నాలుగు టైటిల్స్ గెలుచుకోలేదు. ఈ ఘనత కోహ్లీ ఒక్కడికే దక్కింది.
2008 లో కోహ్లీ సారధ్యంలోనే భారత జట్టు అండర్ 19 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ టోర్నీలో కోహ్లీ కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొట్టాడు. దీంతో అదే సంవత్సరం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2011 లో శ్రీలంకపై భారత్ స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ ప్లేయర్ గా తన వంతు పాత్ర పోషించాడు. ఫైనల్లో కోహ్లీ గంభీర్ తో నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ కు కీలకంగా మారింది. 35 పరుగులు చేసి భారత్ ను పటిష్ట ఒత్తిడిలో నుండి బయట పడేశాడు. ఇక 2013 లో ధోనీ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ జట్టులో కోహ్లీ సభ్యుడు. అంతే కాదు ఇంగ్లాండ్ పై జరిగిన ఫైనల్లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దశాబ్ద కాలంగా తన బ్యాటింగ్ తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి నిన్నటితో 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ టైటిల్ అందుకున్నాడు. ఈ 11 ఏళ్లలో ఎన్నో ఐసీసీ ట్రోఫీలో కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా భారత్ కు ట్రోఫీ అందించలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క టెస్ట్ ఛాంపియన్ షిప్ మినహాయిస్తే కోహ్లీ దగ్గర అన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ ఫైనల్లో సత్తా చాటాడు. 59 బంతుల్లో76 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. ఈ విజయం తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.