పవర్ అంటే ఇదీ: కోహ్లీ సిక్స్ కొడితే చెపాక్ స్టేడియం గోడ బద్ధలయింది..!

పవర్ అంటే ఇదీ: కోహ్లీ సిక్స్ కొడితే చెపాక్ స్టేడియం గోడ బద్ధలయింది..!

టీమిండియా క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే విరాట్ కోహ్లీ పేరు రాకుండా ఆ చర్చ ముగియదు. టీమిండియా క్రికెట్ చరిత్రలో కోహ్లీకి ఉన్న స్థానం అలాంటిది. తన బ్యాటింగ్ బాదుడుతోనే కాదు ముక్కుసూటితనం, అదరనిబెదరని మనస్తత్వంతో యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.

కోహ్లీకి ఫోర్లతో ‘పోకిరి’ పండుగాడిలా ప్రత్యర్థుల బెండు తీయడం తెలుసు, ఇక సిక్స్లు బాదాడంటే ప్రత్యర్థి టీం బౌలర్లకు శివరాత్రి జాగారమే. అంతటి హ్యాండ్ పవర్తో బంతిని బాదిపడేసే విరాట్ కోహ్లీ సెప్టెంబర్ 15, 2024న చరిత్రలో నిలిచిపోయే సిక్స్ కొట్టాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోహ్లీ సిక్సర్ కొట్టిన కొట్టుడుకి స్టేడియం గోడ బద్ధలై బొక్క పడింది. ఈ పరిణామంతో అక్కడున్న వాళ్లంతా షాక్. బంగ్లాదేశ్తో జరగబోతున్న టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు.

చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్లో ఉన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్లోనే కోహ్లీ తన హ్యాండ్ పవర్ చూపించాడు. ‘అది మ్యాన్ హ్యాండా.. హనుమాన్ హ్యాండా’ అనే డౌటొచ్చేలా, ప్రాక్టీస్ సెషన్లో ఉన్న వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. కోహ్లీ కొట్టిన బంతి ఫోర్స్కు డ్రెస్సింగ్ రూం దగ్గరలో ఉన్న గోడకు బొక్కడింది. అలాంటిఇలాంటి కన్నం కాదు బంతి షేప్లో, బంతి సైజులో పెద్ద కన్నం పడింది. జియో సినిమాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. చెపాక్ స్టేడియంలో విరాట్ తన మార్క్ చూపించాడని జియో సినిమా ఆ విజువల్పై రాసుకొచ్చింది.

ఇక.. ఇండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. ఫస్ట్ టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. సెకండ్ టెస్ట్ సెప్టెంబర్ 27న జరగాల్సి ఉంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రెండు మ్యాచులకు రెండూ గెలిచి బంగ్లాదేశ్ జట్టు మాంచి జోష్లో ఉంది. అంతేనా.. అంత గొప్పగా ఆడినందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి బంగ్లా జట్టు రూ.3.20 కోట్ల రివార్డ్ కూడా అందుకుంది. అయినా సరే.. టీమిండియాపై టెస్ట్ సిరీస్ గెలవడం బంగ్లాదేశ్కు అంత ఈజీ కాదు. ఇప్పటిదాకా భారత్లో టీమిండియాపై బంగ్లా జట్టు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవకపోవడం గమనార్హం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా నెంబర్.1 స్థానంలో ఉంది. టెస్ట్ సిరీస్ల్లో టీమిండియా తన హవాను కొనసాగిస్తోంది.