PBKS vs RCB: ఇది మాములు ర్యాగింగ్ కాదు.. రనౌట్‌తో రచ్చ చేసిన కోహ్లీ

PBKS vs RCB: ఇది మాములు ర్యాగింగ్ కాదు.. రనౌట్‌తో రచ్చ చేసిన కోహ్లీ

ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఎక్స్ప్రెషన్స్ తో వైరల్ గా మారాడు. చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ యువ బ్యాటర్ నేహాల్ వధేరా రనౌట్ అయిన  తర్వాత కోహ్లీ సెలెబ్రేషన్ కాస్త అభ్యంతకరంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇన్నింగ్స్ 9 ఓవర్లో వధేరా ఇంగ్లిస్ కలిసి పరుగు తీసే క్రమంలో టిమ్ డేవిడ్, కోహ్లీ చేసిన రనౌట్ కు పెవిలియన్ కు చేరాడు. గత మ్యాచ్ లో 33 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించిన వధేరా.. ఈ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు 5 పరుగులే చేసి ఔటయ్యాడు.   

సాధారణంగా కోహ్లీ సెలెబ్రేషన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం  ప్రత్యర్థి ఆటగాళ్లకు తన సెలెబ్రేషన్ తోనే సమాధానం ఇస్తాడు. వధేరా ఔటైన తర్వాత ఈ పంజాబ్ బ్యాటర్ పై చూస్తూ.. కోహ్లీ అసభ్యంగా ప్రవర్తించాడని కొంతమంది భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్ లో నేహాల్ వధేరాని.. విరాట్ కోహ్లీ ఎన్నో ప్లాన్లు వేసి అవుట్ చేయాలని భావించినా ఫలించలేదు. ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు నేహాల్ వధేరా. అది మనసులో పెట్టుకొని ఇవాల్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తించాడని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో అదరగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత బ్యాటింగ్ లో దుమ్మురేపింది. ఒక మాదిరి లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61:5 ఫోర్లు, 4సిక్సర్లు) తో పాటు విరాట్ కోహ్లీ(54 బంతుల్లో 73: 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ లో ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది.