జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ సత్తా చాటింది. పరుగుల వరద పారిస్తూ భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (72 బంతుల్లో 113,12 ఫోర్లు, 4 సిక్సులు) ఒక్కడే వారియర్ లా పోరాడి ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్లు దంచి కొట్టారు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో 53 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. పవర్ ప్లే తర్వాత కూడా ఈ జోడీ విధ్వంసం ఆగలేదు. సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగించారు. తొలి వికెట్ కు 125 పరుగులు జోడించిన తర్వాత డుప్లెసిస్ చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 33 బంతుల్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన మ్యాక్స్ వెల్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ కు చేరాడు.
మ్యాక్స్ వెల్ ఔటైన తర్వాత కోహ్లీ వన్ మ్యాన్ షో సాగింది. చివర్లో బౌండరీల మోత మోగిస్తూ 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో 14 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ స్కోర్ 180 పరుగుల మార్క్ చేరుకుంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బర్గర్ కు ఒక వికెట్ దక్కింది.
Royal Challengers Bengaluru posted 183 runs against Rajasthan Royals: RR vs RCB pic.twitter.com/Xd0otJ5Cv3
— CRICPUR (@cricpur) April 6, 2024