ODI World Cup 2023: కోహ్లీ సెంచరీ చిచ్చు: దుమ్మెత్తి పోసుకుంటున్న ఇంగ్లాండ్, పాక్ మాజీ క్రికెటర్లు

ODI World Cup 2023: కోహ్లీ సెంచరీ చిచ్చు: దుమ్మెత్తి పోసుకుంటున్న ఇంగ్లాండ్, పాక్ మాజీ క్రికెటర్లు

జీవితం చడీ చప్పుడు లేకుండా గడిచిపోతుంటే ఏం మజా ఉంటది చెప్పండి. కొన్నాళ్ల తరువాత జీవితం ఇంతేనా అని వారిపై వారికే విరక్తి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడు బురదపై రాళ్లు విసురుతుండాలి.. అది మీద పడ్డాక తుడుచుకుంటూ ముందుకు సాగిపోతుండాలి. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్లు అచ్చం ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. ఎదుటి వారిని ఏదో ఒకటి  అనడం.. తిరిగి వారు అంటుంటే కళ్లప్పగించి చూడటం చేస్తున్నారు.

కోహ్లీ వల్లే గొడవ..!

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(101) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. రోహిత్, గిల్ వెనుదిరగాక పరుగులు రావడం కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై నిలకడగా ఆడుతూ సెంచరీ బాదాడు. మొదట్లో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడినా.. చివరకు వచ్చేసరికి 121 బంతుల్లో 101 పరుగులతో లెక్కసరిచేశాడు. ఈ సెంచరీపై మాట్లాడిన మాక్ మాజీ ఆల్ రౌండర్ మహమ్మద్ హఫీజ్.. కోహ్లీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. అతని ఇన్నింగ్స్‌ను  బెన్ స్టోక్స్ సెంచరీతో పోలుస్తూ నిస్వార్థం-స్వార్థానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అనంతరం హఫీజ్ పోస్ట్ పై స్పందించిన ఇంగ్లిష్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ అతనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. "నోటికొచ్చింది మాట్లాడకు.. 240 పరుగుల తేడాతో వారు విజయం సాధించారంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై పరుగులు చేయడం​ ఎంత కష్టంగా మారిందో ఆలోచించాలి. ఓ నాకు ఇప్పుడు అర్థమయ్యింది.. ఒక మ్యాచ్‌లో కోహ్లీ నిన్ను బౌల్డ్‌ చేశాడు కదా.. అందుకే ఇలా స్పందించావా.." అని వాన్‌ కౌంటరిచ్చారు.

వాన్.. మూర్ఖుడు

తాజాగా, వాన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన హఫీజ్.. అతన్ని ఒక మూర్ఖుడిగా సంభోదించాడు. "ఒక మూర్ఖుడితో తెలివిగా మాట్లాడినా.. అతను తిరిగి మిమ్మల్ని మూర్ఖుడు అని పిలుస్తాడు.." అని బదులిచ్చాడు. దీనిపై వాన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి కోహ్లీ సెంచరీ ఇద్దరు క్రికెటర్ల మధ్య గొడవకు కారణమైందనమాట.