Virat Kohli: మాట్లాడటం మానేశా.. ఫేమ్, పవర్ వచ్చాక కోహ్లీ మారిపోయాడు: మాజీ స్పిన్నర్

Virat Kohli: మాట్లాడటం మానేశా.. ఫేమ్, పవర్ వచ్చాక కోహ్లీ మారిపోయాడు: మాజీ స్పిన్నర్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టుకు ఈ ద్యయం పిల్లర్లు లాంటి వారు. ఒకరు భారత టెస్టు జట్టును ప్రపంచ అగ్రస్థానానికి తీసుకెళ్తే, మరొకరు ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ను సాధించి పెట్టారు. ఆధునిక క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా ప్రాచుర్యం పొందిన ఈ జోడి వ్యక్తిత్వాలు భిన్నమైనవి. మైదానంలో రోహిత్ సహచరులను నవ్విస్తూ ఉల్లాసంగా కనిపిస్తే.. కోహ్లి ఎల్లవేళలా సూర్యునిలా భగభగమంటుంటాడు. కోపంతో, దూకుడుగా ఉండటం అతని నైజం. అదే ప్రపంచ క్రికెట్‌లో అతన్ని ఒక రారాజుని చేసింది. అలాంటి విరాట్‌పై భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

కోహ్లీ, రోహిత్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న భారత లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా.. వారిద్దరివి విరుద్ధమైన స్వభావాలని చెప్పుకొచ్చాడు. 2007లో భారత జట్టు అరంగ్రేటం చేసిన సమయంలో రోహిత్ ఎలా ఉన్నాడో.. ఇప్పుడూ అలానే ఉన్నాడని వెల్లడించాడు. అదే అతన్ని ఇంత సక్సెస్ అయ్యేలా చేసిందని చెప్తూ ప్రశంసించాడు. అదే సమయంలో కోహ్లీపై మాత్రం విమర్శలు గుప్పించాడు. ఫేమ్, పవర్ వచ్చాక విరాట్‌ పూర్తిగా మారిపోయాడని తెలిపాడు.

రోహిత్ మారలేదు

"రోహిత్‌ను నేను మొదటిసారి కలిసినప్పుడు, ఇప్పుడు చూస్తే ఒకేలా ఉన్నాడు. మారలేదు. నేను ఐదేళ్లుగా భారత జట్టులో లేను, కానీ ఇప్పటికీ మేము కలుసుకుంటే నాపై జోక్‌లు వేస్తాడు. ఒకరితో ఒకరు ఎలాంటి సాన్నిహిత్యాన్ని కొనసాగించాలో మాకు తెలుసు. మా మధ్య మంచి బంధం ఉంది. అదే కోహ్లీ విషయంలో అలా లేదు.."

పవర్, ఫేమ్ కోహ్లీని మార్చేసింది

"నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి బంధం కోహ్లీతో ఇప్పుడు లేదు. విరాట్ మారడం నేను చూశాను. మేము దాదాపు మాట్లాడటం మానేశాము. చేతికి పవర్ వచ్చినప్పుడు మార్పులు వస్తుంటాయి. కానీ, నేను అలాంటి వారిలో ఒకడిని కాదు. నాకు చీకు 14 ఏళ్ళ నుండి తెలుసు. అతను సమోసాలు తినేటప్పుడు, ప్రతి రాత్రి పిజ్జా అవసరమైనప్పుడు నన్ను పిలిచేవాడు. కానీ నాకు తెలిసిన చీకూకి కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా తేడా ఉంది. ఇప్పుడతను నన్ను కలిసినప్పుడల్లా నా పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. కానీ అది స్పష్టంగా లేదు. రోహిత్‌తో జోక్ చేసే విధంగా కోహ్లీతో చేయలేను.." అని మిశ్రా.. శుభంకర్ మిశ్రాతో జరిగిన YouTube పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. 

అమిత్ మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మాజీ స్పిన్నర్ వెంటనే కోహ్లీ క్షమాపణలు చెప్పాలని అతని అభిమానులు నెట్టింట నానా రభస చేస్తున్నారు.