Ranji Trophy: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం.. కారణమిదే!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. అతను మెడ నొప్పి  కారణంగా సౌరాష్ట్రతో జరగబోయే తొలి మ్యాచ్ కు సిద్ధంగా లేనట్టు సమాచారం. విరాట్ కోహ్లి మెడ బెణకడంతో అతను ఇంజెక్షన్ తీసుకున్నాడని..  కోహ్లీ తమ తొలి మ్యాచ్ ఆడతాడో లేదో అనే విషయంపై తమకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వెల్లడించింది. దీంతో కోహ్లీ జనవరి 23 నుంచి 26 వరకు రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

2012లో ఢిల్లీ తరఫున చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. మరో 12 ఏళ్ళ తర్వాత కోహ్లీని రంజీల్లో చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాచ్ ఆడకపోయినా  రాజ్‌కోట్‌లో వెళ్లి ఢిల్లీ జట్టుతో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. 

2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు కీలకం కానుంది. ఒకవేళ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఢిల్లీ స్క్వాడ్ లో కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ స్టార్ ఇండియన్ వికెట్‌కీపర్ బ్యాటర్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. అతను రైల్వేస్ తో జరగబోయే రెండో మ్యాచ్ కూడా ఆడాడతానని స్పష్టం చేశాడు. 

భారత ఆటగాళ్లందరూ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడాలని ఇటీవలే బీసీసీఐ తప్పనిసరి చేసింది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో కనిపించనున్నారు. రంజీ ట్రోఫీ ప్రదర్శనను బట్టి జూన్ నెలలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కు జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.