హోటల్ గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడలేను..ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉంటేనే మంచిది: కోహ్లీ

హోటల్ గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడలేను..ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉంటేనే మంచిది: కోహ్లీ

బెంగళూరు: ఫారిన్ టూర్ల సమయంలో ఆటగాళ్లతో వారి కుటుంబ సభ్యులు వెంట ఉండటం ఎంతో ఉపయోగకరమని టీమిండియా స్టార్ బ్యాటర్  విరాట్ కోహ్లీ  అంటున్నాడు.  గ్రౌండ్‌‌లో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు హోటల్ గదిలో ఒంటరిగా ఉండటం కంటే కుటుంబంతో గడిపితే ఆటగాడికి ఊరట కలుగుతుందని చెప్పాడు.  ఆస్ట్రేలియాలో బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఇండియా 1–3తో ఓడిన తర్వాత  బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

45 కంటే ఎక్కువ రోజులు జరిగే  టూర్‌‌‌‌లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు 14 రోజులు మాత్రమే వారితో ఉండవచ్చు. షార్ట్‌‌ టూర్లలో ప్లేయర్ల భార్యాపిల్లాలు లేదా గర్ల్‌‌ఫ్రెండ్స్ ఒక్క వారం మాత్రమే ఉండేలా పరిమితి విధించింది. ఈ విషయంపై ఆర్‌‌సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్‌‌లో కోహ్లీ స్పందించాడు. ‘కుటుంబం ఎంత ముఖ్యమో చెప్పడం కష్టం.

మైదానంలో ఎంతటి ఒత్తిడి ఎదురైనా తిరిగొచ్చి  కుటుంబంతో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటలో నిరాశకు గురైనప్పుడు మనకు ఇష్టమైన వారు పక్కనే ఉంటే ఆ బాధ నుంచి కోలుకోవచ్చు. నా వరకు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడటం ఇష్టం లేదు. అందరిలానే సాధారణ జీవితాన్ని కొనసాగించాలనుకుంటాను. ఆడటం నా బాధ్యత, కానీ కుటుంబంతో గడిపే సమయం నా నిజమైన ఆనందం.

అందుకే నేనెప్పుడూ కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోకుండా చూసుకుంటా.  నేనే కాదు ఏ ఆటగాడైనా  కుటుంబం తమతోనే  ఉండాలని అంటాడు. కానీ ఈ విషయం గురించి కొందరు సంబంధం లేని వ్యక్తులు చర్చలు జరపడం చూసి బాధ కలుగుతోంది’ అని విరాట్ పేర్కొన్నాడు. ఇక, తన ఫిట్‌‌నెస్,  తీసుకునే డైట్ విషయంలో తల్లిని ఒప్పించడం ఎంతో కష్టమైందని కోహ్లీ చెప్పాడు.

‘ నేనెంత ఫిట్‌‌గా ఉన్నానో నాకు తెలుసు. ప్రపంచంలోని క్రికెటర్లు నా ఫిట్‌‌నెస్ గురించి, నా డైట్ గురించి మాట్లాడుకుంటున్నారు.  కానీ, నేను పరాటాలు తినడం లేదని, బలహీనంగా మారుతున్నానని మా అమ్మ బాధపడుతోంది.  నేను బాగానే ఉన్నాను, కంగారు పడొద్దని ఆమెను ఒప్పించడం చాలా కష్టం అవుతోంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.