విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నగర జీవితానికి దూరంగా సుమారు 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులను పూర్తి చేసుకుని ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ ఇంట్లో క్రికెట్ పిచ్ కూడా ఉండబోతోందంటూ జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేయగా.. కోహ్లీ సదరు ఛానెళ్ల తీరును తప్పుబడుతూ క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు.
విరుష్క దంపతులు నిర్మిస్తున్న కొత్త ఇళ్లు నగరానికి దూరంగా ఉండడంతో అందులోనే క్రికెట్ పిచ్ నిర్మిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దాన్ని కోహ్లీనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు కూడా వార్తలు ప్రసారం చేశారు. అయితే వీటిని టీమిండియా మాజీ కెప్టెన్ కొట్టి పడేశారు. నమ్మకమైన, తాను నమ్మిన వార్తా పత్రికలు కూడా నకిలీ వార్తలను ప్రచురించడం మొదలు పెట్టాయంటూ సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వెలిబుచ్చారు.
"నేను చిన్నప్పటి నుండి చదివిన వార్తాపత్రికలు కూడా నకిలీ వార్తలను ప్రచురించడం ప్రారంభించాయి(Bachpan se jo akhbaar Padha hai, wo bhi fake news chaapne lage ab).." అని కోహ్లీ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ ఒక్క పోస్ట్‌తో ఆ వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది.
8 ఎకరాల్లో కొత్త ఇళ్లు
కాగా, విరాట్ కోహ్లీ గతేడాది మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో 7.45 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.19.24 కోట్లు వెచ్చించి 2.54 ఎకరాలు, 4.91 ఎకరాల ఆస్తిని రెండు వేర్వేరు ఒప్పందాలలో కొనుగోలు చేశారు. ఆ స్థలంలోనే కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ఇల్లు పూర్తయ్యే సరికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టొచ్చని సమాచారం.