శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో 24 పరుగులు చేసిన విరాట్.. రెండో వన్డేలో 14 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ రెండు మ్యాచ్ ల్లో విఫలమవ్వడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించింది. మూడో వన్డేలోనైనా కింగ్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టుతో పాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొలంబో వేదికగా బుధవారం (ఆగస్ట్ 7) మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి.
కోహ్లీ మరో 78 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో 27000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు 26922 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు. అంతేకాదు వేగంగా 27000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ మ్యాచ్ లో 114 పరుగులు చేస్తే వన్డే కెరీర్ లో 14 వేల పరుగులను వేగంగా పూర్తి చేసుకున్న ప్లేయర్ గా నిలుస్తాడు.
Also Read :- సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో దినేష్ కార్తీక్
వన్డే క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14 వేల పరుగుల క్లబ్ లో ఉన్నారు. సచిన్ కు ఈ ఘనత సాధించడానికి 378 ఇన్నింగ్స్ లు అవసరమైతే.. సంగక్కర 350 ఇన్నింగ్స్ లో పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 14 క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే కేవలం 282 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా అందరికంటే ముందుంటాడు. శ్రీలంకపై అద్భుత రికార్డ్ ఉన్న కోహ్లీకి ఈ రికార్డ్స్ బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.