![IND vs ENG: కోహ్లీ శరీరానికి బంతి విసిరిన బట్లర్.. అరుపులతో దద్దరిల్లిన కటక్ స్టేడియం](https://static.v6velugu.com/uploads/2025/02/virat-kohli-fans-slam-jos-buttler-after-getting-out-just-5-runs_Txp3EU5Xef.jpg)
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విఫలమయ్యాడు. ఐదు పరుగులే చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి వికెట్ కీపర్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఫ్యాన్స్ అతని ఔట్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ ఔట్ అవ్వడానికి బట్లర్ కారణం అని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఇన్నింగ్స్ 20 ఓవర్ లో ఆదిల్ రషీద్ వేసిన బంతిని కోహ్లీ ఆఫ్ సైడ్ ఆడాడు. అక్కడే దగ్గరలో ఫీల్సింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ చేతుల్లోకి బంతి వెళ్ళింది. కోహ్లీ క్రీజ్ లో ఉన్నప్పటికీ బట్లర్ త్రో వేసే వంకతో కోహ్లీ వైపు బంతిని విసిరాడు. బంతి కోహ్లీ శరీరానికి తగలడంతో స్టేడియంలో అభిమానులు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. దీంతో బట్లర్ కోహ్లీకి చేయి చూపిస్తూ క్షమాపణలు చెప్పాడు. కోహ్లీ కూడా తన చేతిని పైకెత్తడంతో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత బంతికే కోహ్లీ ఔటయ్యాడు. బట్లర్ కావాలనే కోహ్లీ ఏకాగ్రతను చెడగొట్టాడని అభిమానులు ఇంగ్లాండ్ కెప్టెన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
ALSO READ | Jacob Bethell: RCB బ్యాడ్ లక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ దూరం
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మెరుపు సెంచరీ(90 బంతుల్లో 119: 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో ఇంగ్లాండ్ ను చిత్తు చేస్తూ భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది.