మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా కొత్త కుర్రాడు కాన్‌స్టస్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం బాక్సింగ్ డే టెస్టులో హీట్ పెంచింది. తొలి రోజు ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు భుజాలతో ఢీకొన్నారు. ఆపైవాగ్వాదానికి దిగగా.. ఖవాజ, అంపైర్లు కల్పించుకొని విడదీశారు. అయితే, విరాట్ తన మధ్య వాగ్వాదం నిజమే అయినా.. ఇండియా బ్యాటర్ తనను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదని ఆట తర్వాత కాన్‌స్టస్ చెప్పాడు.
కానీ, ఈ విషయంలో తప్పు కోహ్లీదే అంటూ మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో ఒక డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా విధించాడు. విరాట్ అంగీకరించడంతో దీనిపై విచారణ చేపట్టడం లేదని తెలిపాడు. మరోవైపు కొత్త కుర్రాడితో కోహ్లీ ప్రవర్తన సరిగ్గా లేదని, తను కావాలనే అతడిని రెచ్చగొట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శించాడు. విరాట్ హద్దుదాటి అనవసరంగా కాన్‌స్టస్ మీదకు వెళ్లాడని ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.