ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతి హై ఫుల్ టాస్ వేశాడు. ఈ బంతిని అడ్డు పెట్టిన కోహ్లీ.. బౌలర్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో హైడ్రామా చోటు చేసుకుంది. నో- బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరిగా నిర్ణయిస్తూ.. కోహ్లీది ఔట్ అని ప్రకటించాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఔట్ గా ప్రకటించినందుకు షాకయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించిప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. వారు ఔట్ అని తేల్చేశారు. దీంతో కోహ్లీ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ తో వాగ్వాదానికి దిగిన కోహ్లీకి జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఉల్లంఘించినందుకు 50 శాతం జరిమానా విధించారు. ఇక ఇదే మ్యాచ్ లో స్లో ఓవరేట్ కారణంగా బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో కోహ్లీ 7 బంతుల్లోనే 2 సిక్సులు, ఒక ఫోర్ తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 221 పరుగులు చేసింది.
Virat Kohli fined 50% of his match fees for breaching IPL Code Of Conduct. pic.twitter.com/utOLnzWjG9
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2024