Virat Kohli: భళా విరాట్.. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ వెనుక జడేజా

Virat Kohli: భళా విరాట్.. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ వెనుక జడేజా

ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ, జడేజాలను పోల్చలేం. ఒకరు టాప్ బ్యాటర్ అయితే.. మరొకరు స్టార్ ఆల్ రౌండర్. ఇద్దరూ భారత జట్టు తరపున అదరగొడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇటీవలే టీమిండియా.. దక్షిణాఫ్రికాపై టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకోవడంతో జడేజా, కోహ్లీ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఐసీసీ విడుదల చేసిన ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ ఆశ్చర్యకరంగా అనిపించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో జడేజా కంటే కోహ్లీ ముందు ఉండడం విశేషం. 

ఐసీసీ అల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి 49 పాయింట్లతో 79వ ర్యాంక్‌ను కైవసం చేసుకోగా.. జడేజా 45 పాయింట్లతో 86వ స్థానంలో నిలిచాడు. కోహ్లి గత దశాబ్దంలో కేవలం 2.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. టీ20ల్లో కోహ్లీ బౌలింగ్ వేయడం ఎప్పుడో  ఆపేశాడు. మరోవైపు జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ లో జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని టీ20 ర్యాంక్ మరింత దిగజారింది. మరోవైపు కోహ్లీ బ్యాటింగ్ లో అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. ఈ కారణంగానే జడేజా కంటే కోహ్లీ ఆల్ రౌండర్ల జాబితాలోకి ముందుకు వచ్చాడు. 

టీ20 ర్యాంకింగ్స్ లో ఉన్న ఆటగాళ్లు కొంతకాలం బౌలింగ్ చేయకపోతే వారి స్థానాలు స్థిరంగా ఉంటాయి. కోహ్లీ బౌలింగ్ చేయక చాలా కాలమైంది. దీంతో అతను టాప్ 100 లో చోటు సంపాదించాడు. ఓవరాల్ గా కోహ్లి 13 టీ20 ఇన్నింగ్స్ ల్లో 51.00 సగటుతో నాలుగు వికెట్లు తీశాడు. ఎకానమీ 8.05 గా ఉంది. మరోవైపు జడేజా 71 ఇన్నింగ్స్‌లలో 30 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఆల్ రౌండర్ల లిస్టులో ఇటీవలే వరల్డ్ కప్ లో సత్తా చాటిన హార్దిక్ పాండ్య నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 12 స్థానంలో నిలిచాడు.