అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క సెంచరీ చేయడం ఏ బ్యాటర్ కైనా కళ. కానీ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కి మాత్రం సెంచరీ అంటే వెన్నతో పెట్టిన విద్య. అలవోకగా సెంచరీలు చేసే సచిన్.. వన్డేల్లో 49 సెంచరీలతో ఎవ్వరికి అంతంత దూరంలో నిలిచాడు. సచిన్ 49 సెంచరీల రికార్డ్ భవిష్యత్తులో బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం అనుకున్నారంతా. అయితే ఈ రికార్డ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా అధిగమించాడు. 50 సెంచరీలు చేసి క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఈ ఘనత అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు.
వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో విరాట్ సెంచరీ చేయడం ద్వారా 50 సెంచరీల మార్క్ అందుకున్నాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేసాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఎమోషనల్ వ్యాఖ్యలు చేసాడు. "ఇదంతా కలలా అనిపిస్తుంది. నా హీరో సచిన్ టెండూల్కర్ నా 50 వ సెంచరీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అతను స్టాండ్స్ లో ఉంది నన్ను అభినందించడం చాలా గొప్ప అనుభూతి. సెంచరీ చేయడం కన్నా నా జట్టును గెలిపించడమే నాకు చాలా ముఖ్యమైన విషయం. టోర్నమెంట్ లో నా పాత్ర సమర్ధవంతంగా పోషించడం చాలా సంతృప్తినిచ్చింది". అని కోహ్లీ సచిన్ ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు.
ఈ టోర్నీలో మొత్తం మూడు సెంచరీలు చేసిన కోహ్లీ, 5 హాఫ్ సెంచరీలు చేసాడు. మొత్తం ఈ మెగా టోర్నీలో 700 కు పైగా పరుగులు చేసిన కోహ్లీ ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ సచిన్ పేరు మీద ఉంది. 2003 వరల్డ్ కప్ లో సచిన్ 673 పరుగులు చేసాడు.