AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ

AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. అలవోకగా పరుగులు చేసే విరాట్.. ఒకో పరుగు కోసం చెమటోడ్చాల్సి వస్తుంది. అతని నుంచి భారీ ఇన్నింగ్స్ లు చూసి చాలా కాలమే అయింది. ఇప్పుడున్న ఫామ్ పక్కనపెడితే ఒకప్పుడు కోహ్లీ ఎలా ఆడేవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రతి వేదికపై సెంచరీ కొట్టిన ఘనత విరాట్ కోహ్లీకిది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కోహ్లీకి అద్భుత రికార్డ్ ఉంది. 

ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాలో కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు. టెస్టుల్లో సైతం సూపర్ రికార్డ్ కోహ్లీ సొంతం. ముఖ్యంగా అడిలైడ్ గ్రౌండ్ లో కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 న జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఆస్ట్రేలియాలో తన ఫేవరేట్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు. 

ALSO READ | SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు

“2018-19 సీజన్ లో ఆస్ట్రేలియాలో నా అత్యుత్తమ నాక్ ఆడాను. ఈ సిరీస్ లో పెర్త్ లో నేను కొట్టిన సెంచరీ నాకెంతో ప్రత్యేకం. ఆస్ట్రేలియాలో నేను ఆడిన అత్యంత కఠినమైన పిచ్ ఇదే. అందులో సెంచరీ కొట్టడం చాలా గొప్ప విషయం" అని కోహ్లీ బీసీసీఐ టీవీలో తెలిపాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రపంచంలో అతి కఠిన పిచ్ లలో ఒకటైన పెర్త్ లో ఇప్పటివరకు కోహ్లీతో పాటు గవాస్కర్, మొహిందర్ అమర్‌నాథ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే సెంచరీలు చేశారు. 

2014 ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉంది. ఈ టూర్ లో నాలుగు టెస్టుల్లోనే 692 పరుగులు చేసి ఔరా అనిపించాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా పెర్త్ లో సెంచరీ చేశాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై  25 టెస్టు మ్యాచ్‌లు ఆడి 47.48 సగటుతో 2042 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు ఉన్నాయి.