Virat Kohli: వేలంలో కోహ్లీ జెర్సీకి రూ.40 లక్షలు

నిరుపేద పిల్లలకు సహాయం చేసేందుకు నిర్వహించిన వేలంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40 లక్షల ధరకు అమ్ముడుపోయింది. అదే వేలంలో అతని గ్లోవ్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడుపోవటం గమనార్హం. 

రాహుల్- అతియా శెట్టి

వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి "క్రికెట్ ఫర్ చారిటీ" పేరుతో వేలాన్ని నిర్వహించారు. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో భారత క్రికెటర్ల బ్యాట్లు, జెర్సీలు, గ్లోవ్స్ అమ్మి రూ.1.93 కోట్ల నిధులు సేకరించారు. అత్యధికంగా కోహ్లీ ధరించిన జెర్సీ 40 లక్షల రూపాయలకు అమ్ముడుపోగా.. అతని గ్లోవ్స్ రూ.28 లక్షల ధర పలికాయి. 

వేలంలో మరికొన్ని..

  • రోహిత్ శర్మ బ్యాట్: రూ.24 లక్షలు
  • ఎంఎస్ ధోని బ్యాట్: రూ.13 లక్షలు
  • రాహుల్ ద్రవిడ్ బ్యాట్: రూ. 11 లక్షలు
  • కేఎల్ రాహుల్ జెర్సీ: రూ. 11 లక్షలు

రాహుల్, అతని సతీమణి అతియా శెట్టి మొదలుపెట్టిన ఈ ప్రచారంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజు శాంసన్, జస్ప్రిత్ బూమ్రా.. విదేశీ ఆటగాళ్లు నికోలస్ పూరన్, జాస్ బట్లర్, క్వింటన్ డికాక్ వంటి పలువురు భాగస్వాములు అయ్యారు. నిరుపేద పిల్లలకు ఉపయోగపడేలా మంచి పనికి పూనుకున్న రాహుల్ దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.