టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కోహ్లీ ఫోన్ లో బాబా నీమ్ కరోలి వాల్‌పేపర్ ఉందని చాలా మంది పోస్ట్ చేశారు. బాబా నీమ్ కరోలి మార్క్ జుకర్‌బర్గ్, స్టీవ్ జాబ్స్‌లను ప్రేరేపించిన గురువని వార్తలొస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ విజయం ముగించుకొని విరాట్ తన కుటుంబాన్ని కలవటానికి లండన్ కు బయలుదేరాడు. అక్కడ అతను విమానాశ్రయంలోకి ప్రవేశించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో నిశితంగా పరిశీలిస్తే.. విరాట్ వాల్ పేపర్ లో ఫోటో బాబా నీమ్ కరోలి అని అర్ధమవుతుంది. 2023లో అనుష్క శర్మ,విరాట్ కోహ్లీ బాబా నీమ్ కరోలి ఆశ్రమాన్ని సందర్శించారు.
ఎవరీ నీమ్ కరోలి బాబా..?
హిందుస్థాన్ టైమ్స్ మరాఠీ ప్రకారం చాలా మంది బాబా నీమ్ కరోలి భక్తులు అతను హనుమంతుని అవతారమని నమ్ముతారు. అనేక కథలు గురువును అద్భుతాలతో అనుబంధిస్తాయి. అతని ప్రధాన ఆశ్రమం కైంచి ధామ్‌లో ఉంది. ఈ ఆశ్రమంను ఆయన 1964లో స్థాపించారు. ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్,ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌లతో పాటు, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా బాబా నీమ్ కరోలీకి భక్తులని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
బాబా తన అలౌకిక శక్తులతోనే కాకుండా తన సిద్ధాంతాల ద్వారా కూడా అందరికీ సుపరిచితమయ్యారు. 1900వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు. మనిషి ఆనందంగా ఉండేందుకు జీవితంలో ఎలా మెలగాలో నీమ్ కరోలీ బాబా లోకానికి తెలియజేశారు. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు,డబ్బును సక్రమంగా వినియోగించాలి,హనుమంతుని పూజించండి అనుసరించడం ద్వారా మనిషి ప్రశాంతంగా కూడా ఉండవచ్చని బాబా తెలిపారు.