
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ చాలా కాలం పాటు జట్టును నడిపిస్తాడని ఆ ఫ్రాంచైజీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి దశాబ్దానికిపైగా ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించాడు. అతని తర్వాత డుప్లెసిస్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరడంతో కొత్తగా యంగ్‌స్టర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ అప్పగించారు.
‘రజత్ ఆర్సీబీకి చాలా కాలం కెప్టెన్‌గా ఉంటాడు. నాయకుడిగా తను గొప్ప పని చేయబోతున్నాడు. అతనిలో విజయానికి అవసరమైన ప్రతీ లక్షణం ఉంది’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొత్త సీజన్‌ను ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రజత్ అన్నాడు. ‘ విరాట్‌తో పాటు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి లెజెండ్స్ ఈ టీమ్‌కు ఆడారు. నేను వాళ్లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉంది’ అని రజత్ చెప్పాడు.