వివాదంలో స్టార్ స్పోర్ట్స్.. 2023 అత్యుత్తమ జట్టులో కోహ్లీకి దక్కని చోటు

వివాదంలో స్టార్ స్పోర్ట్స్.. 2023 అత్యుత్తమ జట్టులో కోహ్లీకి దక్కని చోటు

ఏడాది ముగుస్తుంది అంటే ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలను రివైండ్‌ చేసుకోవడం అందరికీ పరిపాటి. మనం మనుషులం కాబట్టి ఆ ఏడాదిలో జరిగిన మంచి చెడులను లెక్కేసుకుంటాం. అదే సంస్థలయితే పదిలమైన జ్ఞాపకాలను, చిరస్మరణీయ జయాపజయాలను ప్రత్యేకించి గుర్తు చేస్తుంటాయి. ఈ విషయంలో స్టార్ స్పోర్ట్స్ చూపిన అత్యుత్సాహం వివాదంలోకి నెట్టింది.   

ఇంతకీ స్టార్ స్పోర్ట్స్ ఏం చేసిందంటారా..! ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఎంపికచేసి బెస్ట్ ఎలెవన్‌(స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్‌ అఫ్ ది ఇయర్ 2023)జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దీంతో అతని అభిమానులు స్టార్ స్పోర్ట్స్ పై విరుచుకు పడుతున్నారు.

ఓటింగ్‌లో కోహ్లీకి అగ్రస్థానం

ఓటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీకి స్టార్ స్పోర్ట్స్ బెస్ట్ ఎలెవన్‌ జట్టులో చోటు దక్కపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది టెస్టుల్లో రోహిత్ కంటే కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎనిమిదేసి టెస్టులు ఆడగా.. కోహ్లీ 59.10 సగటుతో 591 పరుగులు చేస్తే.. రోహిత్ 45.41 సగటుతో 545 రన్స్ చేశాడు. అలాంటిది కోహ్లీని కాదని స్టార్ స్పోర్ట్స్ రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేసిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

 
స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్‌ అఫ్ ది ఇయర్ 2023: ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా), రోహిత్ శర్మ (భారత్), జో రూట్ (ఇంగ్లాండ్), కేన్ విలియంసన్ (న్యూజిలాండ్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), రవీంద్ర జడేజా (భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్).