కోహ్లీ కాదు.. మా జట్టులో సచిన్ ఆడాలి: ఆసీస్ స్టార్ ప్లేయర్స్

కోహ్లీ కాదు.. మా జట్టులో సచిన్ ఆడాలి: ఆసీస్ స్టార్ ప్లేయర్స్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీమిండియా తరపున బ్యాటింగ్ రికార్డులన్నీ తమ పేరిట లిఖించుకున్నారు. అప్పటి తరంలో సచిన్  ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే ఎదురుగా ఎలాంటి జట్టు ఉన్నా బెంబేలిత్తిస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే విషయం చెప్పడం కష్టం. అయితే ఇదే ప్రశ్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైంది. ఆస్ట్రేలియన్ జట్టులో ఒక భారత ఆటగాడిని ఎంపిక చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు అని అడిగారు. 

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లందరూ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పారు. అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్‌లో ఆస్ట్రేలియన్ గ్రేట్ స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబిస్చాగ్నే ఆస్ట్రేలియా జట్టులో సచిన్ ఉండాలని తమ మనసులో మాట బయట పెట్టారు. నాథన్ లియాన్, అలెక్స్ కారీ కోహ్లిని ఎంపిక చేశారు. జోష్ హేజిల్‌వుడ్ మాత్రం జస్ప్రీత్ బుమ్రాను ఆస్ట్రేలియా తరపున ఆడాలనుకునే ఆటగాడిగా ఎంపిక చేసుకున్నాడు.

విరాట్, సచిన్ ఇద్దరికీ ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లి ఆస్ట్రేలియాపై 47 సగటుతో 2042 టెస్టు పరుగులు చేశాడు. వీటిలో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 53 సగటుతో ఎనిమిది సెంచరీలతో 2367 పరుగులు చేశాడు. టీ 20 విషయానికి వస్తే 49.62 సగటుతో 794 పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ టెస్టుల్లో 55 సగటుతో ఆస్ట్రేలియాపై 3630 టెస్టు పరుగులు చేశాడు. వీటిలో 11 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో తొమ్మిది సెంచరీలు.. 44 యావరేజ్ తో 3077 పరుగులు చేశాడు.