Virat Kohli: వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో కలకలం

Virat Kohli: వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో కలకలం

కొద్దిరోజుల క్రితం భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కలకలం రేపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో వీడియో క్రియేట్ చేసిన  నేరగాళ్లు.. అందులో సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే ఓ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా చూపించారు. పైగా ఈ గేమ్ ఆడుతూ తన కూతురు సారా భారీగా సంపాదిస్తోందని సచిన్ అందులో చెప్తున్నట్లు చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో.. భారత మాజీ దిగ్గజం మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. తాజాగా, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదే బాధితుడిగా మారాడు.

ఏవియేటర్ అనే ఓ గేమింగ్ యాప్‌ను విరాట్ కోహ్లి ప్రమోట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కోహ్లీ..  ఏవియేటర్ యాప్‌లో వేలల్లో పెట్టుబడితో లక్షల్లో సంపాదించవచ్చని, తానూ ఖాళీ దొరికితే ఇందులో డబ్బులు డిపాజిట్‌ చేస్తానని కోహ్లీ చెప్పినట్టుగా చూపించారు. ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే బోనస్‌ కూడా వస్తుందని కోహ్లీ చూపించినట్టుగా వీడియోలో ఉంది. వాస్తవానికి కోహ్లీ ఎలాంటి ఆన్‌లైన్ గేమ్‌ను ప్రమోట్ చేయలేదు. ఇవన్నీ నకిలీవే. టెక్నాలజీ సాయంతో కొందరు నేరగాళ్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏదేమైనా విరాట్ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.

క్రికెట్‌కు దూరంగా విరాట్

ఇక కోహ్లీ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. మొదటి రెండు టెస్టులు దూరంగా ఉన్న కోహ్లీ.. ఆ తరువాత సిరీస్ నుంచే వైదొలిగాడు. ప్రస్తుతం అతడు అనుష్క శర్మతో కలిసి లండన్‌లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.