న్యూఢిల్లీ: క్రికెట్‌లో తాను ఇన్ని రన్స్, సెంచరీలు చేస్తానని కెరీర్ ఆరంభంలో అనుకోలేదని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న విరాట్(48).. క్రికెట్ లెజెండ్ సచిన్ సెంచరీ (49)ల వరల్డ్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఈ రికార్డును సమం చేస్తాడని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ‘క్రికెట్ గురించి మాట్లాడితే నేను ఇన్ని రన్స్, సెంచరీలు, రికార్డులు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి ఆట, పెర్ఫామెన్స్ గురించి కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. దేవుడు అలా అశ్వీర్వదించాడు. నేను ఇలా చేయాలని మాత్రమే కలగన్నాను. కానీ అన్ని అలాగే జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదు.
మన జీవితం ఇలాగే ముందుకెళ్లాలని ఏ ఒక్కరూ ప్లాన్ చేయలేరు. 12 ఏండ్ల కెరీర్‌లో ఇన్ని సెంచరీలుగానీ, ఇన్ని రన్స్‌గానీ చేస్తానన్న ఆలోచన కూడా లేదు’ అని విరాట్ పేర్కొన్నాడు. ఒకానొక దశలో తనలో ప్రొఫెషనలిజం కొరవడిందని భావించి లైఫ్‌స్టైల్‌ను మార్చుకున్నానని చెప్పాడు. ‘నేను టీమ్ కోసం బాగా ఆడాలి. కఠిన పరిస్థితుల్లోనూ టీమ్‌ను గెలిపించాలి. ఇదే నా ఫోకస్. ఇందుకోసం నా లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నా. నాలో ఆట ఉన్నా ప్రొఫెషనలిజం లేదని తెలిసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు నా దృష్టంతా మ్యాచ్‌పైనే ఉంటుంది. నేను సాధించిన ఫలితాలన్నీ ఆ విధంగా ఆడటం ద్వారానే వచ్చాయి’ అని పేర్కొన్నాడు.