Virat Kohli: వన్డేల్లో అసాధారణ ప్రదర్శన.. విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డు

Virat Kohli: వన్డేల్లో అసాధారణ ప్రదర్శన.. విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డు

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఐసీసీ అవార్డు వచ్చి చేరింది. 2023లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను ఐసీసీ ఉత్తమ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఆదివారం (జూన్ 2) ఉదయం ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో విరాట్‌కు ట్రోఫీ, క్యాప్ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసింది.   

2023 లో వన్డేల్లో కోహ్లీ అసాధారణ ప్రదర్శన చేశాడు. మొత్తం 24 ఇన్నింగ్స్‌లలో 72.47 యావరేజ్ తో 1377 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు.. ఎనిమిది అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 100 ఉండడం విశేషం. అత్యుత్తమ స్కోర్ 166. టీమిండియా 8 వ సారి ఆసియా కప్ గెలుచుకోవడంతో పాటు  స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 35 ఏళ్ల కోహ్లి 2023 వన్డే ప్రపంచ కప్‌లో పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో 11 మ్యాచ్‌లలో 95.62 సగటుతో 765 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 

ఇందులో మూడు సెంచరీలతో పాటు ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 2024 టీ20 వరల్డ్ కప్ కు సిద్దమవుతున్నాడు. మే 30 న న్యూయార్క్ చేరుకున్న కోహ్లీ..   న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న కోహ్లీ..  జూన్ 5న ఐర్లాండ్ తో జరగబోయే తొలి మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు.