విరాట్ కోహ్లీ స్వార్థపరుడు.. సెంచరీ కోసమే ఆడతాడు: పాక్ మాజీ కెప్టెన్

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు.. సెంచరీ కోసమే ఆడతాడు: పాక్ మాజీ కెప్టెన్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ నిరాధార ఆరోపణలు చేశారు.  2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కోసమే ఆడాడని పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత మైలురాయి కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాడని, ఉద్దేశపూర్వకంగానే పెద్ద షాట్లు ఆడలేదని 43 ఏళ్ల హఫీజ్ ఆరోపించాడు.   

స్వార్థపరుడు

90 పరుగులపైన ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా పెద్ద షాట్ కొట్టేందుకు ప్రయత్నించకపోవడం సరైనది కాదని హఫీజ్ వ్యాఖ్యానించాడు. 

"ఎవరు బ్యాటింగ్ చేసినా, మీ ఉద్దేశం, ఆడే విధానం ఎప్పుడూ గేమ్‌ని గెలిపించే దిశగానే ఉండాలి. కానీ 90లలో ఉన్నప్పుడు ఎవరైనా పెద్ద షాట్లు ఆడకుండా ఆపితే, దానిని నేను ఎప్పటికీ అంగీకరించను. 95 నుండి 100 మార్కును చేరుకోవడానికి ఎవరైనా 3 లేదా 4 బంతుల్లో కొట్టడం గురించి ఆలోచించడం లేదు. 10 నుండి 15 బంతులు వృధా చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ అలానే ఆడాడు. 100 పరుగులకు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నాడు. అతను పెద్ద షాట్లు ఆడలేదు.." అని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌క్యాస్ట్‌లో హఫీజ్ వ్యాఖ్యానించాడు.

ఈడెన్ గడ్డపై శతకం

భారత క్రికెట్ మక్కా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. 121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సఫారీ జట్టు 83 పరుగులకే అలౌటై 243 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయ్యింది.