ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. సొంతగడ్డపై నేరవేరేనా..?

ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. సొంతగడ్డపై నేరవేరేనా..?

బెంగుళూరు: ఐపీఎల్ 18లో భాగంగా గురువారం (ఏప్రిల్ 10) మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ సీజన్‌‌లో చెరో మూడు విజయాలతో జోరుమీదున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక పోరుకు రెడీ అయ్యాయి. గురువారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో గెలిచి టాప్‌‌ ప్లేస్‌‌ను మరింత సుస్థిరం చేసుకోవాలని డీసీ భావిస్తుండగా, నంబర్‌‌ వన్‌‌లో నిలవాలని ఆర్సీబీ ప్లాన్‌‌ చేస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో నెగ్గిన ఢిల్లీ మంచి కాన్ఫిడెన్స్‌‌తో ఉంది. 

కోల్‌‌కతా, చెన్నై, ముంబై వంటి బలమైన జట్లపై ప్రత్యర్థి హోం గ్రౌండ్లలో నెగ్గిన ఆర్సీబీ సొంతగడ్డపై గుజరాత్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఓడింది. ఇప్పుడు ఢిల్లీని దెబ్బకొట్టి హోం గ్రౌండ్‌లో తొలి విజయం అందుకోవాలని  బెంగళూరు కృతనిశ్చయంతో ఉంది. దీంతో ఆర్సీబీ మాజీ కెప్టెన్, స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌ కోహ్లీపైనే అందరి ఫోకస్‌‌ నెలకొంది. 

ఇదిలా ఉంటే.. రికార్డుల రారాజుగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఐపీఎల్‎లో మునుపెన్నడూ చూడని అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అదేంటంటే.. ఐపీఎల్‎లో కోహ్లీ ఇప్పటి వరకు 998 బౌండరీలు (720 ఫోర్లు మరియు 278 సిక్సర్లు) కొట్టాడు. ఐపీఎల్‎లో 1000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‎గా చరిత్ర సృష్టించడానికి మరో రెండు అడుగుల దూరంలోఉన్నాడు. 

Also Read :- మా లీగ్ మొదలవుతుంది.. IPL వదిలేసి PSL చూస్తారు

దీంతో గురువారం (ఏప్రిల్ 10) ఢిల్లీతో జరగనున్న మ్యాచులో రెండు బౌండరీలు బాదితే ఐపీఎల్ హిస్టరీలోనే 1000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‎గా కోహ్లీ అరుదైన రికార్డ్ సృష్టించనున్నాడు. కోహ్లీ తర్వాత ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు బాదిన వారిలో శిఖర్ ధావన్ (920), డేవిడ్ వార్నర్ (899) ఉన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‎లో 885 బౌండరీలు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే కాకుండా మరో రికార్డును కూడా ఈ మ్యాచులో కోహ్లీ నమోదు చేసే అవకాశం ఉంది.

 కోహ్లీ తన T20 కెరీర్‌లో ఇప్పటివరకు 99 హాఫ్ సెంచరీలు, 9 సెంచరీలు సాధించాడు. ఇవాళ ఢిల్లీతో జరిగే మ్యాచులో హాఫ్ సెంచరీ సాధిస్తే.. పొట్టి ఫార్మాట్‌లో 100 హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకుంటాడు. ప్రస్తుత సీజన్‎లో కోహ్లీ మంచి ఫామ్‎లో ఉన్నాడు. దీన్ని బట్టే చూస్తే సొంతగడ్డపై కోహ్లీ ఈ రికార్డులను నమోదు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరీ కోహ్లీ ఈ అరుదైన రికార్డులు క్రియేట్ చేస్తాడా..? మరికొన్ని రోజులు ఆగాలా..? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.