కేప్‌టౌన్ : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. ఇందుకోసం పక్కాగా సన్నద్ధం అవుతోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం మొదలయ్యే రెండో మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం ముమ్మర ప్రాక్టీస్ చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నెట్స్‌లో చెమటోడ్చారు. సౌతాఫ్రికా పేసర్ లెఫ్టార్మ్ పేసర్ నాండ్రీ బర్గర్ సవాల్‌ను తిప్పికొట్టేందుకు కోహ్లీ, షార్ట్ బాల్ బలహీనత నుంచి బయటపడేందుకు శ్రేయస్ అయ్యర్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.
ఎప్పట్లానే అందరికంటే ముందుగానే నెట్స్‌కు వచ్చిన విరాట్ తొలుత సెంటర్ నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఆపై బయటి నెట్స్‌లో 20 నుంచి 25 నిమిషాల పాటు హై ఇంటెన్సిటీ త్రో డౌన్స్ ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేశాడు. ఓ లెఫ్టార్మ్ నెట్ బౌలర్‌తో పాటు బుమ్రా, సిరాజ్, అశ్విన్, అవేశ్ ఖాన్ అతనికి బంతులు వేశారు. ఎక్కువగా ఫ్రంట్ ఫుట్‌పై ఆడిన విరాట్ కొన్నిసార్లు క్రీజు దాటొచ్చి బాల్స్‌ను మిడ్ వికెట్ మీదకు పంపించాడు. బుమ్రా బౌలింగ్‌లో సూపర్‌గా ఆడిన కోహ్లీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్ కొట్టాడు. మరోవైపు తొలి టెస్టులో షార్ట్ బాల్‌కు ఔటైన శ్రేయస్ అయ్యర్..
శ్రీలంకకు చెందిన త్రో డౌన్ స్పెషలిస్ట్ నువాన్ 18 గజాల దూరం నుంచి వేసిన ఓ బాల్‌ను పుల్ చేయబోయి మిస్సయ్యాడు. అది పొట్టపై తాకడంతో కాసేపు బ్యాటింగ్ ఆపేశాడు. ఆ తర్వాత 18 గజాల దూరం నుంచి బాల్స్ వేసిన ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్ట్‌లను ఎదుర్కొన్న అయ్యర్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ఇక, శనివారం జరిగిన సెషన్‌లో ఎడమ భుజానికి బాల్ తగలడంతో ఇబ్బంది పడ్డ శార్దూల్ ఠాకూర్ కూడా ప్రాక్టీస్ వచ్చాడు. కానీ నెట్స్‌లో కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రమే చేశాడు. గిల్, కేఎల్ రాహుల్ కూడా నెట్స్ సెషన్‌లో పాల్గొన్నారు.