Virat Kohli: మ్యాట్రెస్ కంపెనీ వినూత్న ప్రచారం.. అమెరికా గడ్డపై కోహ్లీ విగ్రహావిష్కరణ!

Virat Kohli: మ్యాట్రెస్ కంపెనీ వినూత్న ప్రచారం.. అమెరికా గడ్డపై కోహ్లీ విగ్రహావిష్కరణ!

విరాట్ కోహ్లీ.. ఈ భారత మాజీ సారథిని మెచ్చని వారంటూ ఎవరూ ఉండరు. క్రీడా ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అథ్లెట్ మన భారత క్రికెటర్. గత దశాబ్దన్నర కాలంగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అనితర సాధ్యుడు మన విరాట్. క్రికెట్ ప్రపంచంలో అతని స్థిరత్వం, అతను నెలకొల్పిన రికార్డులు వేటికవే ప్రత్యేకం. అంతటి ఘన చరిత్ర కలిగిన మన పరుగుల యంత్రానికి ఓ మ్యాట్రెస్ కంపెనీ అమెరికా గడ్డపై విగ్రహావిష్కరణ చేసింది. 

కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రెస్ కంపెనీ.. న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్‌లో అతని విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఎంతో రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్‌లో అతని విగ్రహం కనబడే సరికి వీడియోలూ నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియోలో విరాట్.. టైమ్స్ స్క్వేర్ మధ్యలో బ్యాట్‌ని పైకి లేపి నిలబడి ఉన్నట్లు చూడవచ్చు.

నిజమైనది కాదట..!

అమెరికా గడ్డపై కోహ్లీ విగ్రహం చూసి భారత క్రికెట్ అభిమానులూ ఆశ్చర్యపోయారు. మొదట అది నిజం కాకపోవచ్చు అని అనుకున్నా.. క్రీడా ప్రపంచాన్ని శాసిస్తున్నాడు కదా..! పెట్టి ఉండొచ్చని అనుకున్నారు. కానీ, అదంతా ప్రమోషన్ అని తరువాత తెలిసొచ్చింది. అది నిజమైన విగ్రహం కాదట.. కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ (CGI) అని తెలుస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా మ్యాట్రెస్ కంపెనీ చేసిన హడావిడని సమాచారం. తమ సంస్థ పరుపులు అందించే సౌకర్యాన్ని హైలైట్ చేయడానికి CGI విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. కోహ్లీ ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్‌ దేశాలు ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో భాగంగా ఉన్నాడు.