SA v IND: ఈ సారి ఫలించని మంత్రం: కోహ్లీ మైండ్ గేమ్‌ను తిప్పి కొట్టిన మార్కరం

SA v IND: ఈ సారి ఫలించని మంత్రం: కోహ్లీ మైండ్ గేమ్‌ను తిప్పి కొట్టిన మార్కరం

బెయిల్స్ మారిస్తే క్రికెట్ లో వికెట్లు పడతాయనే సెంటిమెంట్ ఒకటి ఉంది. 2023 లో యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత చాలా సార్లు ఈ మంత్రం ఫలించింది. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెయిల్స్ మార్చగా ఆ తర్వాత ఓవర్లో బుమ్రా వికెట్ పడగొట్టాడు. అయితే నిన్న జరిగిన కేప్ టౌన్ టెస్టులో కోహ్లీ అదే సీన్ రిపీట్ చేయాలని ప్రయతించినా ఫలించలేదు. 

భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ లో రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా కోహ్లీ చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. ఆట చివరి ఓవర్ చివరి బంతికి మార్కరంతో మైండ్ గేమ్ ఆడాడు. స్లిప్‌ కార్డన్‌లో నిలబడిన విరాట్‌ కోహ్లి బెయిల్స్‌ని మార్చి మార్కరం ఏకాగ్రతను చెడగొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన మార్క్రామ్ అంపైర్‌ని పరిశీలించమని కోరగా.. కోహ్లి, KL రాహుల్‌ దీనిపై సంతృప్తి వ్యకతం చేశారు. మరో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ముఖేష్ కుమార్‌తో చాలాసేపు మాట్లాడాడు. దీంతో మార్కరం కాస్త కలవరానికి గురయ్యాడు. 

ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 4,5 బంతులను బౌండరీలుగా మలిచిన మార్కరం.. చివరి బంతిని ఆడే క్రమంలో సమయాన్ని వృధా చేస్తూ భారత ఆటగాళ్లకు ఊహించని కౌంటర్ ఇచ్చాడు. ఇక చివరి బంతిని జాగ్రత్తగా డిఫెన్స్ ఆడిన మార్కరం రోజును ముగించాడు. భారత ప్లేయర్లు మార్కరం సహనాన్ని ఎంతలా పరీక్షించినా.. మార్కరం తనదైన శైలిలో తిప్పి కొట్టాడు. సెంచూరియన్ టెస్టులో బెయిల్స్ మారిస్తే వికెట్లు పడతాయి అని ఆశించిన కోహ్లీకి నిరాశ తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.

అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ కావడంతో 98 పరుగుల ఆధిక్యం లభించింది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో ఉన్న టీమిండియా.. చివరి సెషన్‌ మొదలైన తొలి 8 ఓవర్లలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 11 బంతుల్లో మ్యాచ్ తలకిందులైపోయింది. భారీ ఆధిక్యం ఖాయమన్న దశలో స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది.