ఐపీఎల్ కొత్త సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించేందుకు 16 ఏండ్లుగా ఎదురు చూస్తున్న కింగ్ విరాట్ కోహ్లీ కల ఈసారైనా నెరవేరాలని బెంగళూరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరు అమ్మాయిలు ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో డుప్లెసిస్ కెప్టెన్సీలోని అబ్బాయిలు కూడా టైటిల్ నెగ్గితే ఆర్‌సీబీకి అంతకుమించిన ఆనందం మరోటి ఉండబోదు. ఇక, 2015 నుంచి ప్లేఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఈసారైనా టాప్–4లోకి వస్తుందేమో చూడాలి.
పంజాబ్ కెప్టెన్ ధవన్ అనారోగ్యం కారణంగా చెపాక్ స్టేడియంలో జరిగిన కెప్టెన్ల ఫొటో షూట్‌కు రాలేదు. అతని ప్లేస్‌లో వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ అటెండ్ అయ్యాడు. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2022లో ఫైనల్ చేరి, గతేడాది కొద్దిలో ప్లేఆఫ్స్ బెర్తు కోల్పోయిన రాజస్తాన్ సంజు శాంసన్ సారథ్యంలో మరో పోరాటానికి సిద్ధమైంది.
గాయాలతో గత సీజన్‌కు దూరమైన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ కెప్టెన్లుగా తిరిగొస్తున్నారు. యాక్సిడెంట్‌లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్ 14 నెలల్లోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ చేసేందుకు క్లియరెన్స్ వచ్చింది. కెప్టెన్సీ కూడా చేపట్టడంతో అందరి ఫోకస్ అతనిపైనే ఉండనుంది.