
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL) ఆడబోతున్నాడని. బిగ్ బాష్ లీగ్ ప్రముఖ ఫ్రాంఛైజ్ అయిన సిడ్ని సిక్సర్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘వెల్ కమ్ టూ కింగ్ కోహ్లీ..! విరాట్ వచ్చే రెండు సీజన్లు సిడ్ని సిక్సర్ తరుఫున ఆడబోతున్నాడు’’ అని ట్వీట్ చేసింది.
ఈ ఒక్క పోస్ట్ విరాట్ అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ఎందుకంటే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు రిటైర్ అయ్యే వరకు బీబీఎల్ వంటి విదేశీ లీగ్‌లలో ఆడటానికి అనుమతి లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి.. వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. అలాంటప్పుడు కోహ్లీ బిగ్ బాష్ లీగులో ఎలా ఆడతాడు..? కోహ్లీ వన్డే, టెస్టులకు కూడా వీడ్కోలు పలకబోతున్నాడా..? అని సిడ్నీ సిక్సర్స్ ట్వీట్‌తో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
అసలు ఇదేంటని ఏం అర్థం కాకా కోహ్లీ ఫ్యాన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో చావు కబురు చల్లగా చెప్పినట్లు.. సిడ్ని సిక్సర్స్ మరో ట్వీట్ చేసింది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ బిగ్ బాష్ లీగ్ ఆడట్లేదని.. అభిమానులను ఏప్రిల్ ఫూల్ చేయడానికే అలా పోస్ట్ చేశామని చెప్పింది. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ మొదట సిడ్నీ సిక్సర్‌పై కోపం వ్యక్తం చేసినా.. చివరకు మాత్రం ఇది మాములు ఏప్రిల్ ఫూల్ కాదంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతా.. టైటిల్ గెలవడమే లక్ష్యం.. కన్ఫర్మ్ చేసిన కోహ్లీ!
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 31 పరుగులు చేసి ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడాల్సి ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం కొంత ఫామ్ లేమి సమస్యతో తడబడుతున్నాడు.