IND vs NZ: వికెట్ తీసి బతికించావ్: అక్షర్ పటేల్ కాళ్ళు పట్టుకున్న కోహ్లీ

IND vs NZ: వికెట్ తీసి బతికించావ్: అక్షర్ పటేల్ కాళ్ళు పట్టుకున్న కోహ్లీ

దుబాయ్ వేదికగా ఆదివారం (మర్చి 2) న్యూజిలాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 249 పరుగులు చేసిన టీమిండియా బౌలింగ్ లో అద్భుతంగా రాణించి మ్యాచ్ గెలుచుకుంది. దీంతో టేబుల్ టాపర్ గా రోహిత్ సేన సెమీస్ లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియంసన్ ఔట్ కావడంతో భారత్ విజయం ఖరారైంది. విలియమ్సన్ వికెట్ తో విరాట్ కోహ్లీ పట్టరాని సంతోషంతో చేసిన ఒక ఘటన వైరల్ అవుతుంది. 

250 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీ చేసి న్యూజిలాండ్ ను గెలిపించేందుకుకేన్ విలియంసన్ పోరాడుతున్నాడు. అప్పటికే 81 పరుగులు చేసి క్రీజ్ లో సెట్ అయిన విలియంసన్.. టీమిండియాను టెన్షన్ పెడుతున్నాడు. అయితే ఇన్నింగ్స్ 41 ఓవర్లో విలియంసన్ ను స్పిన్నర్ అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. ఈ ఓవర్ చివరి బంతిని షాట్ కొట్టాడటానికి క్రీజ్ వదిలి బయటకు వచ్చిన కేన్ స్టంపౌటయ్యాడు. అక్షర్ సూపర్ డెలివరీకి కోహ్లీ ఫిదా అయిపోయాడు. అక్షర్ దగ్గరకు వచ్చి అతని కాళ్ళను మొక్కే ప్రయత్నం చేశాడు. 

ఈ విషయాన్నీ ముందే పసిగట్టిన అక్షర్.. వద్దు అంటూ కోహ్లీని తన కాళ్ళు పట్టుకోనీకుండా చేసేందుకు ప్రయత్నించాడు. సరదాగా సాగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వికెట్ పడినప్పుడు కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కోహ్లీ నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులే చేసి హెన్రీ బౌలింగ్ లో ఫిలిప్స్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ కు ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్(79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.  250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. ఒక్క విలియమ్ సన్(81) మినహాయిస్తే మిగిలిన కివీస్ బ్యాట్స్మెన్స్ ఎవరూ టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ను చావు దెబ్బ తీశాడు.