క్రికెట్‌లో సచిన్ వారసుడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మాస్టర్‌ను మించిపోతున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌కు తానే రారాజునని కోహ్లీ మరోసారి చాటి చెప్పాడు. 49 సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 452 ఇన్నింగ్స్‌లు అవసరం అయితే కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు అందుకున్నాడంటే అతని జోరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సచిన్ 2012లో మీర్పూర్‌లో తన వందో ఇంటర్నేషనల్ సెంచరీ, వన్డేల్లో 49వ వంద సాధించాడు. దీని కోసం సచిన్ ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. కోహ్లీ మాత్రం మూడు వారాల్లోనే 48 నుంచి 49 సెంచరీలకు చేరుకొని సచిన్‌ను అందుకున్నాడు. మధ్యలో కివీస్ (95), శ్రీలంక (88)పై వంద చేజార్చుకున్నా పట్టువదల కుండా ఈ మ్యాచ్‌లో సాధించాడు.
ఛేజ్ మాస్టర్‌గా పేరొందిన కోహ్లీ ఈడెన్‌లో ఓవైపు జట్టుకు మంచి స్కోరు అందించే బాధ్యత తీసుకుంటూనే తన పుట్టిన రోజున గొప్ప రికార్డు దిశగా కదిలాడు. స్పిన్నర్లు కేశవ్ (29 బాల్స్), షంసి (27 బాల్స్)ని జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు. పిచ్ స్పిన్నర్లకు సపోర్ట్ ఇస్తుండటంతో వీళ్ల బౌలింగ్‌లో ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేదు. పట్టుదలగా ఆడుతూ ఒక్కో పరుగుతో ఇన్నింగ్స్ నిర్మిస్తూ సెంచరీ అందుకున్నాడు. ఈ చారిత్రక సందర్భంలో దూకుడుగా సంబరాలు చేసుకోకుండా హెల్మెట్ తీసి తన బ్యాట్‌కు ముద్దు పెట్టిన కోహ్లీ ఆకాశం వైపు చూస్తూ అభివాదం చేయడం చూస్తే అతనిపై ఉన్న భారం దిగినట్టు అనిపించింది.
కానీ, స్టేడియంలోని 69 వేల మంది ఫ్యాన్స్ తమ ఫోన్లలో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ టైమ్‌లో వారి అరుపులతో సౌండ్ 118 డెసిబుల్స్ దాటింది. చిన్న జట్టు నెదర్లాండ్స్‌తో మరో లీగ్ మ్యాచ్ ఉండటం, ఇండియా సెమీస్ చేరిన నేపథ్యంలో కోహ్లీ 50వ వన్డే సెంచరీ ఈ టోర్నీలో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక, అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ సెంచరీల సంఖ్య 79 (టెస్టుల్లో 29, టీ20ల్లో 1)కి చేరుకుంది. విరాట్ ఇదే జోరు కొనసాగిస్తూ ఇంకో మూడు నాలుగేండ్లు ఆడితే సచిన్ వంద ‘వంద’ల రికార్డును అందుకోవడం కూడా సాధ్యమే.
వన్డేల్లో రన్స్ పరంగా సౌతాఫ్రికాకు ఇదే పెద్ద ఓటమి. 2002లో పాక్ చేతిలో 182 రన్స్ తేడాతో ఓడిన రికార్డు బ్రేక్ అయింది.
వరల్డ్ కప్ మ్యాచ్‌లో సెకండ్ బెస్ట్ బౌలింగ్ చేసిన ఇండియా స్పిన్నర్ గా జడేజా (5/33) నిలిచాడు. యువరాజ్ (5/31) ముందున్నాడు.
వరల్డ్ కప్‌లో బర్త్‌డే రోజున సెంచరీ చేసిన మూడో ప్లేయర్ కోహ్లీ. రాస్ టేలర్ 2011లో, మిచెల్ మార్ష్ ఇదే టోర్నీలో ఈ ఘనత సాధించారు.
వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ఈ ఏడాది వెయ్యి రన్స్ చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అతను వెయ్యి రన్స్ చేయడం ఇది ఎనిమిదోసారి. ఏడుసార్లు ఈ ఘనత సాధించిన సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
బాగా ఆడావు విరాట్. 49 నుంచి 50 (ఏజ్)కి చేరుకోవడానికి నాకు ఈ ఏడాది 365 రోజులు పట్టింది. నువ్వు ఇదే ఫామ్ కొనసాగించి మరి కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకొని నా రికార్డు బ్రేక్ చేస్తావని ఆశిస్తున్నా.
- సచిన్ టెండూల్కర్
ఇండియాకు ఆడే ప్రతి అవకాశం నాకు పెద్దదే.
నా బర్త్‌డేన ఇంత మంది ఫ్యాన్స్ ముందు సెంచరీ కొట్టడం చిన్నప్పటి నా కల నిజమైనట్టు అనిపిస్తోంది. నా హీరో రికార్డును సమం చేయడం నాకెంతో స్పెషల్. బ్యాటింగ్‌లో సచిన్ పర్ఫెక్ట్. తనంత గొప్పగా నేను ఎప్పటికీ అవ్వలేను. నన్ను అభినందిస్తూ సచిన్ చేసిన ట్వీట్ చూశా. ఇది నాకు చాలా ఎమోషనల్ మూవెంట్. నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు. టీవీలో సచిన్ ఆట చూస్తూ పెరిగా. అలాంటి వ్యక్తి నుంచి ప్రశంసలు పొందడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.