IND vs PAK: పాకిస్థాన్‌పై ‘చీకూ’ సెంచరీ చేస్తాడు.. రాసి పెట్టుకోండి: హర్భజన్

IND vs PAK: పాకిస్థాన్‌పై ‘చీకూ’ సెంచరీ చేస్తాడు.. రాసి పెట్టుకోండి: హర్భజన్

ఆదివారం(ఫిబ్రవరి 23) పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పారు. కావాలంటే తన మాటలు రాసిపెట్టుకోవాలని శపథం చేశారు. అంతేకాదు, విరాట్ సెంచరీ మరుక్షణం తన భాంగ్రా స్టెప్పులు చూస్తారని పలికారు.  

"నేనిప్పుడు ఒక పెద్ద అంచనా వేయబోతున్నాను. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ 100 పరుగులు చేస్తే ఎలా ఉంటుంది..? అవును నేనంటోంది నిజమే. గత 4 నెలల్లో అతను ఎలా రాణించాడనేది ప్రజలకు, అభిమానులకు అనవసరం. ఆ స్కోర్లు ఎవరికీ గుర్తుండవు. రేపు పాకిస్థాన్‌పై 100 పరుగులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. దేశం మొత్తం అతని వెనుకే ఉంది. విరాట్ 100 పరుగులు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అది జరిగిన మరు నిమిషం నేను భాంగ్రా చేయబోతున్నాను.." అని హర్భజన్ అన్నారు.

కోహ్లీ తన పాత్రను అర్థం చేసుకున్నాడు.. 

జట్టులో తన పాత్రేంటో కోహ్లీకి బాగా తెలుసని, అతను తిరిగి ఫామ్‌లోకి రావాలని హర్భజన్ అన్నారు. భారత స్టార్ ఫామ్‌లోకి రావడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. కోహ్లీ శనివారం ప్రాక్టీస్ సెషన్‌కు 90 నిమిషాల ముందుగానే వచ్చి చెమటోడ్చిన విషయాన్ని హర్భజన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

పేలవ ఫామ్‌.. 

హర్భజన్ ఆశల్లో తప్పు లేనప్పటికీ, కోహ్లీ ఫామ్‌ అందరినీ కలవర పరుస్తోంది. కోహ్లీ చివరి వన్డే సెంచరీ నవంబర్ 15, 2023న ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై నమోదైంది. అది గడిచి దాదాపు ఏడాదన్నర కావొస్తోంది. గత 6 వన్డేల్లో కేవలం ఒకే ఒక  అర్ధ సెంచరీ చేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టు(అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.