
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో ఏదో రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దుమ్ము లేపుతున్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 72.33 సగటుతో 217 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు అతను మరో రెండు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో జరగనున్న మెగా ఫైనల్లో కోహ్లీ 55 పరుగులు చేస్తే ఏ రికార్డ్స్ బద్ధలవుతాయో ఇప్పుడు చూద్దాం.
ఛాంపియన్స్ ట్రోఫీలోకి అత్యధిక పరుగులు:
ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 17 మ్యాచ్ ల్లో 746 పరుగులు చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ 46 పరుగులు చేస్తే.. ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీసీ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ 17 మ్యాచ్‌లు ఆడి 791 పరుగులు చేసి టాప్ ఉన్నాడు. కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బహుశా కోహ్లీకి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కావొచ్చు.
సచిన్ తర్వాత స్థానం:
వన్డేల్లో ఇటీవలే ఫాస్టెస్ట్ 14000 పరుగులు పూర్తి చేసుకొని రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. కివీస్ తో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరో 55 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సంగక్కరకు అధిగమించి సచిన్ తర్వాత రెండో స్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం 301 వన్డేల్లో కోహ్లీ 14,180 పరుగులు చేయగా.. సంగక్కర 14234 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ కు ఈ రికార్డ్స్ బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ లో కోహ్లీ ఖాతాలో పాకిస్థాన్ పై చేసిన సెంచరీతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చేసిన 84 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఉంది. ఫైనల్లో విరాట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గోల్డెన్ బ్యాట్ గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.