IND vs NZ: ఒకటే మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న ఏడు రికార్డులు

IND vs NZ: ఒకటే మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న ఏడు రికార్డులు

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ క్రికెట్ లో లెక్కలేనన్ని రికార్డ్స్ నెలకొల్పాడు. ముఖ్యంగా వన్డేలో కోహ్లీ ఫామ్ అసాధారణం. కెరీర్ ప్రారంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న కోహ్లీ ఆల్ టైం బెస్ట్ వన్డే బ్యాటర్ గా కితాబులందుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై సూపర్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఇదే ఫామ్ న్యూజిలాండ్ పై కొనసాగించడానికి సిద్ధమయ్యాడు. ఆదివారం (మార్చి 2) న్యూజిలాండ్ తో భారత్ గ్రూప్ లో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ బద్దలు కొట్టడానికి ఏడు రికార్డ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..  

1) ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరపున అత్యధిక పరుగులు:

ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 15 మ్యాచ్ ల్లో 651 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ 51 పరుగులు చేస్తే.. శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టి, టోర్నమెంట్ చరిత్రలో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ధావన్ మెన్ ఇండియా తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు.

2) ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు:

న్యూజిలాండ్‌పై కోహ్లీ 142 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో క్రిస్ గేల్ 17 మ్యాచ్‌లు ఆడి 791 పరుగులు చేసి టాప్ ఉన్నాడు. 742 పరుగులతో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు  కోహ్లీ ఇప్పటివరకు 15 మ్యాచ్ ల్లో 651 పరుగులు  చేసి ఏడో స్థానంలో నిలిచాడు. 

3)న్యూజిలాండ్ పై వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు:

2008లో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటి నుండి కోహ్లీ న్యూజిలాండ్ పై 31 వన్డేలు ఆడాడు. కివీస్ జట్టుపై వన్డేల్లో ఇప్పటివరకు 1645 పరుగులు చేశాడు. ఆదివారం జరగబోయే మ్యాచ్ లో 106 పరుగులు చేయగలిగితే, న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్(1750) రికార్డ్ బద్దలు కొడతాడు. ఓవరాల్ గా న్యూజీలాండ్ పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ 51 మ్యాచ్ ల్లో 1971 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు. 

4)న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు:

కోహ్లీ ఇప్పటివరకు న్యూజిలాండ్ పై ఆడిన 31 వన్డేల్లో ఆరు సెంచరీలు చేశాడు. విరాట్ కివీస్ పై సెంచరీ చేస్తే వన్డేల్లో ఆ న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. కివీస్ పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ జాబితాలో,  వీరేంద్ర సెహ్వాగ్, పాంటింగ్ ఆరు సెంచరీలతో కోహ్లీ సమానంగా ఉన్నాడు. 

5)ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వన్డే  ఈవెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు:

కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరు సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఐసీసీ వన్డే ఈవెంట్లలో (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) 23 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొడితే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు 50 కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. అదే విధంగా ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో 24 సార్లు 50 కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగాను సచిన్, ధావన్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో సచిన్, కోహ్లీ, ధావన్ 23 సార్లు 50కి పైగా పరుగులు చేసి టాప్ లో ఉన్నారు. 

ALSO READ : IND vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. ప్రయోగాలపై టీమిండియా దృష్టి.. రోహిత్ స్థానంలో పంత్


6) వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా:

ఆదివారం (ఫిబ్రవరి 23) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 14,000 వన్డే పరుగులు చేసి అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై ఆదివారం జరగబోయే మ్యాచ్ లో 150 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ క్రికెటర్  కుమార్ సంగక్కర రికార్డును బద్దలు కొట్టి వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అవతరిస్తాడు. 15 ఏళ్ల వన్డే కెరీర్‌లో సంగక్కర శ్రీలంక తరపున 404 మ్యాచ్‌లు ఆడి 14,234 పరుగులు చేశాడు.


7) వన్డేల్లో రెండో అత్యధిక ఫీల్డర్ గా క్యాచ్ ల రికార్డ్: 

కోహ్లీ వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 156 క్యాచ్‌లను అందుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మహమ్మద్ అజారుద్దీన్ రికార్డ్ బ్రేక్ చేసి భారత్ తరపున అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు. కోహ్లీ న్యూజిలాండ్ పై జరగబోయే మ్యాచ్ లో మరో మూడు క్యాచ్ లు అందుకుంటే పాంటింగ్ రికార్డు (160 క్యాచ్‌లు)ను బద్దలు కొట్టి వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రెండో ఫీల్డర్ గా నిలుస్తాడు. మహేల జయవర్ధనే టాప్ లో ఉన్నాడు.