T20 World Cup 2024: సర్ వెస్లీను కలిసిన కోహ్లీ, రోహిత్.. విండీస్ దిగ్గజం నుంచి స్పెషల్ గిఫ్ట్

T20 World Cup 2024: సర్ వెస్లీను కలిసిన కోహ్లీ, రోహిత్.. విండీస్ దిగ్గజం నుంచి స్పెషల్ గిఫ్ట్

టీ20 వరల్డ్ కప్ లో భారత క్రికెట్ జట్టు అమెరికాలో మ్యాచ్ లను ముగించుకొని వెస్టిండీస్ లో అడుగుపెట్టింది. సూపర్ 8 లో మూడు మ్యాచ్ లను వెస్టిండీస్ లోనే ఆడనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 20 న ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో  ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వెస్లీ హాల్ ను కలిసి ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు. 

సర్ వెస్లీ హాల్ సంతకం చేసిన "ఆన్సరింగ్ ది కాల్ -ది ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ ఆఫ్ సర్ వెస్లీ హాల్" పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. బార్బడోస్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ, రోహిత్ ఈ వెటరన్ క్రికెటర్ ను కలుసుకున్నాడు. 1960 దశాబ్దంలో వెస్టిండీస్ తరపున వెస్లీ తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. విండీస్ తరపున 48 టెస్టుల్లో 26 యావరేజ్ తో 192 వికెట్లు పడగొట్టాడు. 

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ ఇలా విఫలం కావడం ఇదే తొలిసారి. ఐర్లాండ్, అమెరికా లాంటి పసికూనలపై ఆడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మినహా మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. సూపర్ 8 కు ముందు వీరిద్దరూ ఫామ్ లోకి రావడం టీమిండియాకు చాలా కీలకం.