
బెంగళూరు: తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెక్ పెట్టాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అదే సమయంలో మరోసారి ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే అవకాశం లేదని శనివారం ఆర్‌సీబీ నిర్వహించిన కార్యక్రమంలో విరాట్ చెప్పాడు. ‘నా కెరీర్ విషయంలో ఆందోళన వద్దు. నేను ఎలాంటి ప్రకటన (రిటైర్మెంట్‌పై) చేయడం లేదు. ప్రస్తుతానికి అంతా బాగుంది. గేమ్‌ను ఇంకా ప్రేమిస్తున్నాను. ఆటను ఇష్టపడటం, ఆస్వాదించడం, పోటీతత్వం ముఖ్యం. అలా చేస్తున్నంత వరకు ఆడుతూనే ఉంటా. అలాగే నేను ఎలాంటి ఘనతల కోసం ఆడటం లేదు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చడం మంచి పరిణామమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మెగా గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐపీఎల్ ఎంతగానో దోహదపడిందని అన్నాడు.ఒలింపిక్ చాంపియన్‌గా నిలవడమనేది మరిచిపోలేని అనుభూతి అవుతుందన్న విరాట్.. ఇండియా గోల్డ్ మెడల్‌కు క్వాలిఫై అయితే ఆ ఒక్క మ్యాచ్ ఆడేందుకు టీ20 రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకుంటానని సరదాగా చెప్పాడు.