- ఢిల్లీ ప్లేయర్ల కంటే విరాటే ఫిట్.. ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్–18, జియో సినిమాలో లైవ్
న్యూఢిల్లీ: దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. గ్రూప్–డిలో భాగంగా గురువారం నుంచి రైల్వేస్‌తో జరిగే ఢిల్లీ త0చివరి మ్యాచ్ కోసం విరాట్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. బుధవారం రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ట్రెయినింగ్ సెషన్‌లో కోహ్లీ ఎక్కడా అలసిపోయినట్లు కనిపించలేదు. ఢిల్లీ టీమ్‌లో మిగతా కుర్ర ప్లేయర్ల కంటే విరాటే ఎక్కువ ఫిట్‌గా ఉండటం విశేషం. ఫుట్‌బాల్ వామప్‌తో మొదలైన ఈ సెషన్‌లో విరాట్ గంటపాటు బ్యాటింగ్ చేశాడు.
స్పిన్నర్లు హర్ష్ త్యాగి, సుమిత్ మాథుర్‌తో పాటు పేసర్లు నవ్‌దీప్ సైనీ, మనీ గ్రెవాల్, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ.. విరాట్‌కు బౌలింగ్ వేసేందుకు చాలా శ్రమించారు. తర్వాత త్రో డౌన్స్ ఎదుర్కొన్నాడు. నెట్ సెషన్ తర్వాత తన సహచరులందరూ విశ్రాంతి తీసుకోగా, విరాట్ మాత్రం గ్రౌండ్ చుట్టూ మరో రెండు రౌండ్లు వేశాడు. సెషన్ తర్వాత తన కిట్‌బ్యాగ్‌ను తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. బ్యాగ్‌ను సర్ది, తీసుకెళ్లేందుకు మేనేజర్ మహేశ్ భాటి వేరే వాళ్లను పంపించినా కోహ్లీ సున్నితంగా తిరస్కరించాడు. ‘బాయి మీరు ఏం మాట్లాడుతున్నారు.
ఇది నా ప్లేయింగ్ కిట్. దాన్ని నేనే మోసుకెళ్లాలి’ అంటూ భాటికి నవ్వుతూ సమాధానమిచ్చాడు. రెండున్నర గంటల పాటు సాగిన సెషన్‌లో ప్లేయర్లందరూ అలసిపోయారని డీడీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అత్యంత సుదీర్ఘమైన ట్రెయినింగ్ సెషన్ ఇదే కావడంతో చాలా మంది ప్లేయర్లు చిరాకుగా కనిపించారన్నారు. కానీ కోహ్లీ మాత్రం రన్నింగ్‌తో సెషన్‌ను ముగించడం అతని ఫిట్‌నెస్‌కు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రైల్వేస్‌కే చాన్స్..
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ 17 పాయింట్లతో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై బోనస్ పాయింట్‌తో గెలిస్తే 24 పాయింట్లతో నాకౌట్‌కు చేరే చాన్స్ ఉంది. ఇక ఆరు మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించిన ఢిల్లీ ఇందులో గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి రిజల్ట్‌పై దృష్టి లేకపోయినా విరాట్ బరిలోకి దిగుతుండటంతో 10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తమిళనాడు (25), చండీగఢ్ (19), సౌరాష్ట్ర (18) ఢిల్లీ కంటే మంచి పొజిషన్‌లో ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో ప్రత్యేకంగా విరాట్‌పైనే దృష్టి పెట్టిన డీడీసీఏ అతన్ని ఎప్పటిలాగే నాలుగో నంబర్‌లోనే ఆడించనుంది. మరోవైపు హర్యానాతో రంజీ మ్యాచ్ కోసం కర్నాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా నెట్స్‌లో చెమటోడ్చాడు. 40 నిమిషాల సెషన్‌లో కట్స్, డ్రైవ్స్, ఫ్లిక్స్‌తో ఆకట్టుకున్నాడు.