ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇందుకు ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ ఏ క్రికెటర్ కు లేదు. సోషల్ మీడియాలో విరాట్ క్రేజ్ చూస్తే బిత్తరపోవాల్సిందే. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే అయినా కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టుకు ఇప్పటివరకు టైటిల్ రాలేదు. 17 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్నా ట్రోఫీ అందించలేకపోతున్నాడు. అయితే ఈ సారి విరాట్ గురి తప్పలేదనిపిస్తుంది. ఈ సారి ఆర్సీబీకు టైటిల్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఫస్ట్ హాఫ్ లోనే ఆ జట్టుకు వరుస పరాజయాలు వెంటాడాయి. తొలి 8 మ్యాచ్ లో బెంగళూరు ఒకటే మ్యాచ్ గెలిచింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ పోరాటానికి చిరునామా అయినా కోహ్లీ నమ్మకం కోల్పోలేదు. ఒక్క శాతం అవకాశమున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.
బ్యాటింగ్ లో తన పంథా మార్చాడు. ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పారిస్తూ జట్టును తన భుజాలపై మోశాడు. ఓ వైపు నిలకడగా ఆడుతూనే.. మరోవైపు వేగంగా పరుగులు చేసి ఆర్సీబీ ప్రతి మ్యాచ్ ల్లో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సహచర ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ప్లే ఆఫ్స్ కు వెళ్తామని వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ మహిళల జట్టుకు కోహ్లీ ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారుతుంది. ఈ కార్యక్రమంలో కొన్ని సార్లు ఒక్క శాతం అవకాశమున్నా మనకు సరిపోతుంది. వాటిని వదులుకోకూడదు అని చెప్పాడు.
కోహ్లీ స్పీచ్ తో రాయల్ ఛాలెంజర్స్ మహిళలు ఉమెన్స్ ఏకంగా టైటిల్ కొట్టారు. ఇక సేమ్ ఇదే సీన్ పురుషుల జట్టులోనూ జరుగుతుంది. ఒక దశలో ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన బెంగళూరు.. ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరి అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. ఒకరకంగా ఐపీఎల్ లో ఇది బెస్ట్ కంబ్యాక్ అని చెప్పవచ్చు. ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలంగా రావడం ఆర్సీబీకు కలిసి వచ్చింది. సవాళ్ళను ఇష్టపడే కోహ్లీ మరోసారి తన పట్టుదలతో ఆర్సీబిను ప్లే ఆఫ్స్ కు చేర్చి.. అసాధ్యమైనదేదీ లేదని నిరూపించాడు.