కోహ్లీ కోసం క్యూ కట్టారు.. ఢిల్లీ రంజీ మ్యాచ్‌‌కు భారీ ఫ్యాన్స్‌‌

కోహ్లీ కోసం క్యూ కట్టారు.. ఢిల్లీ రంజీ మ్యాచ్‌‌కు భారీ ఫ్యాన్స్‌‌

న్యూఢిల్లీ: టీమిండియా సూపర్‌‌ స్టార్‌‌ విరాట్ కోహ్లీ 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలో నిలిచిన రంజీ మ్యాచ్‌‌ కోసం అభిమానులు పోటెత్తారు.  గురువారం రైల్వేస్‌‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదలైన ఢిల్లీ మ్యాచ్ లో  కోహ్లీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  10 వేల మంది వస్తారని అంచనా వేసినా ఆ సంఖ్య 15 వేలకు చేరింది. టాస్‌‌కు ముందే చాలా మంది ఫ్యాన్స్‌‌ స్టేడియానికి రావడంతో మొదట 6 వేల కెపాసిటీ గల గంభీర్‌‌ స్టాండ్‌‌ను ఓపెన్‌‌ చేశారు. కానీ స్టేడియం బయటకు క్యూ లైన్స్ పెరిగిపోవడంతో 11 వేల సామర్థ్యం కలిగిన బిషన్‌‌ సింగ్‌‌ బేడీ స్టాండ్‌‌ను తెరిచారు.  గ్రౌండ్ లోకి వచ్చేందుకు పోటీపడటంతో  గేట్ల ముందు కొంత తొక్కిసలాట జరిగి నలుగురికి గాయాలయ్యాయి. 

మ్యాచ్‌ టైమ్‌లో ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని కోహ్లీ వైపు దూసుకెళ్లాడు. శుక్రవారం కోహ్లీ బ్యాటింగ్‌‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్‌‌ సంఖ్య మరింత పెరగనుంది. విరాట్ సెంటర్‌‌ ఆఫ్‌‌ అట్రాక్షన్‌‌గా నిలిచిన ఈ మ్యాచ్‌‌లో రైల్వేస్‌‌ బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. ఉపేంద్ర యాదవ్‌‌ (95), కర్న్‌‌ శర్మ (50) రాణించడంతో.. తొలి రోజు రైల్వేస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 67.4 ఓవర్లలో 241 రన్స్‌‌కు ఆలౌటైంది.ఢిల్లీ బౌలర్లలో సైనీ,  సుమిత్‌‌ చెరో మూడు, సిద్ధాంత్‌‌, మనీ గ్రెవాల్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 10 ఓవర్లలో 41/1 స్కోరు చేసింది. సనత్‌‌ సంగ్వాన్‌‌ (9 బ్యాటింగ్‌‌), యష్‌‌ ధూల్‌‌ (17 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. 

శార్దూల్‌‌ హ్యాట్రిక్‌‌.. కేఎల్ రాహుల్ ఫెయిల్‌‌

మేఘాలయాతో మ్యాచ్‌‌లో ముంబై పేసర్‌‌ శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (4/43) హ్యాట్రిక్‌‌తో సహా నాలుగు వికెట్లు  పడగొట్టాడు. దీంతో మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌‌లో 24.3 ఓవర్లలోనే 86 రన్స్‌‌కే కుప్పకూలింది. హిమాను పుకాన్‌‌ (28) టాప్‌‌ స్కోరర్‌‌. తర్వాత ఆట ముగిసే టైమ్‌‌కు ముంబై తొలి ఇన్నింగ్స్‌‌లో 59 ఓవర్లలో 213/2 స్కోరు చేసింది.  మరోవైపు హర్యానాతో మ్యాచ్‌‌లో కర్నాటక స్టార్ కేఎల్‌‌ రాహుల్‌‌ (29) ఫెయిలయ్యాడు. కెప్టెన్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ (91), దేవదత్‌‌ పడిక్కల్‌‌ (43), రవిచంద్రన్‌‌ స్మారన్‌‌ (35) మెరుగ్గా ఆడటంతో కర్నాటక తొలి ఇన్నింగ్స్‌‌లో 267/5 స్కోరు చేసింది.