IPL 2025: వచ్చే సీజన్‌లో అతన్ని చూడలేం.. 14 ఏళ్ళ కుర్రాడిపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

IPL 2025: వచ్చే సీజన్‌లో అతన్ని చూడలేం.. 14 ఏళ్ళ కుర్రాడిపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ళ వయసులోనే ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వైభవ్ ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. సన్ రైజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి ఫ్యూచర్ స్టార్ అంటూ కితాబులందుకున్నాడు. తొలి మ్యాచ్ లో 20 బంతుల్లో 34 పరుగులు.. రెండో మ్యాచ్ లో  12 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. 

సూర్యవంశీ కెరీర్ పై టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వార్నింగ్ ఇచ్చాడు. వైభవ్ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ముందు తీసుకెళ్లాలని.. ఈ యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుండి ప్రేరణ పొందాలని సలహా ఇచ్చాడు. ఎంత మంచి పేరు సంపాదించినా ఆటలో   విమర్శలను అంగీకరించాలని.. నిలకడగా ఉండాలని సూర్యవంశీని సెహ్వాగ్ హెచ్చరించాడు. బాగా ఆడితే ప్రశంసలు దక్కడం ఎంత సహజమో.. ఆడకపోతే విమర్శలకు సిద్ధంగా ఉండాలని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. వైభవ్ ఈ ఐపీఎల్‌తో సంతోషంగా ఉంటే ఇప్పుడు కోటీశ్వరుడు అని అనుకుంటే బహుశా మనం అతన్ని వచ్చే ఏడాది చూడకపోవచ్చు అని సెహ్వాగ్ అన్నారు.

"ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల  తర్వాత మంచి పేరును సంపాదించిన చాల మంది ఆటగాళ్లను చూసాను. కానీ ఆతర్వాత కనుమరుగయ్యారు. ఎందుకంటే వారు స్టార్ ప్లేయర్ అయ్యారని వారు భావిస్తారు. సూర్యవంశీ ఇప్పటివరకు తన రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాట్ అంచులు తగలడం ద్వారా బౌండరీలు సాధించాడు. పెద్ద షాట్స్ ఆడడంలో విఫలమవుతున్నాడు. సూర్యవంశీ ఐపీఎల్‌లో 20 సంవత్సరాలు ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. విరాట్ కోహ్లీని చూడండి. అతను 19 సంవత్సరాల వయసులో ఆడటం ప్రారంభించాడు. 

►ALSO READ | KKR vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్!

అతను 18 సీజన్లన్నీ ఆడాడు. వైభవ్ కూడా విరాట్ ను అనుకరించడానికి ప్రయత్నించాలి". అని క్రిక్ బజ్ ద్వారా సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జాక్ పాట్ కొట్టాడు.  రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది. పదమూడేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వంశీ కోటి పది లక్షలకు అమ్ముడుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.