ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ టోర్నీనా? ఫైనల్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? సగటు క్రికెట్ అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలివి. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ధోనితో సహా ఎవరి వద్ద సమాధానం లేదు. ఈ తరుణంలో ధోని క్రికెట్ కెరీర్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సహాయంతో ధోని వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడు..' అన్న వార్తలను సెహ్వాగ్ కొట్టిపడేశాడు. ధోనీ జట్టులో ఉన్నదే కెప్టెన్సీ కోసం.. అలాంటప్పుడు అతనికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించాడు.
క్రిక్‌బజ్ తో మాట్లాడిన సెహ్వాగ్.. 'ఫిట్‌గా ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడటం పెద్ద కష్టం కాదు. కానీ ధోనీ ఈ ఏడాది పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. తాను మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దాన్ని ఎక్కువ చేసుకోవాలనుకోవట్లేదు. చాలా వరకూ అతడు చివరి రెండు ఓవర్లలోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అది కూడా అభిమానులను నిరాశ పరచడం ఇష్టం లేక. ఈ సీజన్ లో అతడు ఆడిన మొత్తం బాల్స్ లెక్కేస్తే మహా అయితే 40-50 ఉంటాయి'.
'అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనీకి వర్తించదు. ఎందుకంటే ఆ రూల్ కేవలం బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ చేయని వాళ్లకు లేదా బ్యాటింగ్ అవసరం లేని ఓ బౌలర్‌కు వర్తిస్తుంది. కానీ ధోనీ విషయంలో అలా కాదు. అతడు ఖచ్చితంగా 20 ఓవర్లపాటు ఫీల్డ్ లోనే ఉండాలి. అతడు జట్టులో ఉన్నదే కెప్టెన్సీ కోసం. అలాంటప్పుడు అది సాధ్యపడదు. ఒకవేళ అతడు కెప్టెన్ గా తప్పుకుంటే.. ఇంపాక్ల్ ప్లేయర్‌గానూ ఆడడు. అదే జరిగితే అతన్ని మనం మెంటార్ లేదా కోచ్‌గా చూడొచ్చు..' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
నిజానికి రిటైర్మెంట్ వార్తలపై ధోని ఎన్నడూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 8, 9 నెలల సమయం ఉన్నదని.. ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకు అంటూ ఏదో వంకతో సమాధానాన్ని దాటవేస్తున్నాడు. ఏదేమైనా ధోని రిటైర్మెంట్ పై స్పష్టత రావాలంటే ఫైనల్ మ్యాచ్ ముగియాల్సిందే.