టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా 'విరూపాక్ష'. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి రోజు నుంచే ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 12 కోట్లు రాబట్టగా.. 2వ రోజు 28 కోట్లు, మూడో రోజు 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా. ఇక 4వ రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది.
సాయిధరమ్ తేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా .. ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమాగా 'విరూపాక్ష' నిలవడం విశేషం. ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం కూడా మరో విశేషం. తెలుగులో చాలాకాలం తర్వాత భిన్నమైన కథతో వచ్చిన విరూపాక్ష హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. విరూపాక్ష చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని, ఈ ఓటీటీ వేదికపైనే విరూపాక్ష ప్రదర్శించబడుతుందని థియేటర్స్ లో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అయితే ఎన్ని వారాలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.