బోర్డు తిప్పేసిన కన్సల్టెంట్ ​ఏజెంట్.. బాధితుల ఆందోళన

గల్ఫ్​దేశాలకు పంపేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని జగిత్యాలలో ఫేక్​ వీసాలు సృష్టిస్తున్న  ఓ ఏజెంట్​ గుట్టు రట్టైంది. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు ఆగస్టు10న మీడియాతో తమ గోడు వెల్లడించారు. 

వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ మహేష్​ ధర్మపురి రోడ్​లోని విగ్నేశ్వర కమ్యూనికేషన్​ ఇంటర్నేషనల్​ మ్యాన్ పవర్​ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం ఓ షాప్ ని అద్దెకు తీసుకున్నాడు. 

ఉపాధి నిమిత్తం గల్ఫ్​ దేశాలకు వెళ్లే జిల్లా వాసులకు ఫేక్ వీసాలు చేసి ఇస్తానని చెప్పి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఏళ్లుగా ఈ దందా నడుపిస్తూ..  ఇప్పటివరకు రూ.5 కోట్ల వరకు సంపాదించాడు. 

ఇటీవల అకస్మాత్తుగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు రెండ్రోజుల క్రితం వారు పోలీస్​స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. 

పోలీసులు సైతం తమ గోడును పట్టించుకోవట్లేదని.. యూరప్, దుబాయ్, కువైట్, థాయిలాండ్ దేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇచ్చి తమను మోసం చేశాడని.. దీంతో రూ.వేలల్లో  నష్టపోయినట్లు చెప్పారు. మహేష్​ని పట్టుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్​ చేశారు.