విశాఖపట్నం సెంట్రల్ జైలు.. ఒకప్పుడు ఈ జైలు పేరు చెబితే ఖైదీలకు నిలయంగా గుర్తుకొచ్చేది. కొన్నేళ్లుగా అది వివాదాల కేంద్ర కారాగారంగా పేరు గడించింది. తరచూ ఏవో ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి విశాఖ సెంట్రల్ జైలు వార్తల్లో నిలిచింది. వార్డర్స్ ను చెక్ చేయడం వివాదాస్పదంగా మారడంతో విశాఖ సెంట్రల్ జైలు ఎదుట వార్డర్స్ కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు 66 మందిపై బదిలీ వేటు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ...
విశాఖ సెంట్రల్ జైలు లో తలెత్తిన వివాదం రచ్చకు దారి తీసింది. విధులకు హాజరవుతున్న వార్డర్లను, కానిస్టేబుళ్లను తనిఖీలు చేస్తున్నారు. దీంతో వార్డర్లు, కానిస్టేబుళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారని కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఘటనలో 37మంది వార్డర్స్, హెడ్‌వార్డర్స్ తో కలిపి 66 మందిపై బదిలీ వేటు పడింది. ఖైదీల మాదిరిగా తమను అవమానకరంగా దుస్తులిప్పించి వారి ముందే నగ్నంగా నిల్చోబెడితే విధులు ఎలా నిర్వర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన సిబ్బంది ఆందోళనకు దిగారు.