ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు విశాఖ జిల్లా కలెక్టర్ హరిందర్ ప్రసాద్.41 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని..వారికి కూడా పరిహారం ప్రకటిస్తామని చెప్పారు.
అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రమాదంలో 18 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం, గాయపడ్డవారికి 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలుంటాయన్నారు.
ఇవాళ ప్రమాదం జరిగిన సెజ్ ను సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఆతర్వాత హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఎసెన్షియా అడ్వాన్స్ డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ఆగస్టు 21న మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 17మంది మరణించిన సంగతి తెలిసిందే. 40మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పిటల్స్ కు తరలించి..చికిత్స అందిస్తున్నారు. మందుల తయారీలో ఉపయోగించే 500KL సామార్థ్యం గల రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. కాలిపోయిన కార్మికుల డెడ్ బాడీలు కొన్ని గుర్తు పట్టలేనంతగా మాడిపోయాయి. మిగిలిన కార్మికుల డెడ్ బాడీలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. NDRFసిబ్బంది పొక్లెయిన్ తో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు.